- ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్
కూకట్పల్లి, వెలుగు : దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు మహిళా దొంగలను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సనత్‌నగర్, ఫతేనగర్‌లో ఉండే బండారి షాలిని(34), గంబూ మహేశ్వరి(43), ఉప్పు సరిత(38) ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. వీరు గతంలో పలుమార్లు అరెస్టయి జైలుకి కూడా వెళ్లి వచ్చారు. అయినా పద్ధతి మార్చుకోలేదు. రద్దీగా ఉండే మాల్స్, మార్కెట్లు, షాపుల వద్ద మహిళలను టార్గెట్ చేసి చోరీలు చేస్తుంటారు.
జనవరి 13న రాత్రి మూసాపేట ప్రగతినగర్‌లో ఉండే నాగమణి కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. ఆ టైంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో రూ. 40 వేల క్యాష్ఉంది. కూరగాయలు కొన్న తర్వాత చూసుకుంటే బ్యాగ్ కనిపించలేదు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంగళవారం కూకట్పల్లి వై జంక్షన్‌లోని లేక్షోర్మాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నాగమణి బ్యాగ్‌ని చోరీ చేసింది తామేనని అంగీకరించారు. నిందితుల నుంచి రూ. 15 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
