అప్లికేషన్లకే హంగామా.. మరో మూడు రోజులే గడువు

అప్లికేషన్లకే హంగామా.. మరో మూడు రోజులే గడువు
  • భారీగా అనుచరులతో తరలివస్తున్న కాంగ్రెస్ ఆశావహులు
  • బ్యాండ్ మేళంతో వచ్చి.. పటాకులు కాల్చి.. అప్లికేషన్ల సమర్పణ
  • ఇప్పటిదాకా వచ్చినవి 306.. మరో మూడు రోజులే గడువు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం అప్లికేషన్ సమర్పించేందుకే ఆశావహులు మస్తు హంగామా చేస్తున్నారు. టికెట్ కన్ఫామ్ అయిపోయి.. బీఫాం వచ్చినప్పుడు చేసినంత హడావుడి చేస్తున్నారు. గాంధీభవన్ పెద్దల ముందు తమ అంగబలం, అర్థబలం చూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా కార్యకర్తలు, అనుచరులతో వచ్చి బల ప్రదర్శన చేస్తున్నారు. బ్యాండ్ మేళాల చప్పుళ్లతో ర్యాలీగా వచ్చి.. పటాకులు కాలుస్తూ అప్లికేషన్లను ఇస్తున్నారు. దీంతో గాంధీభవన్ పరిసరాలు మొత్తం సందడిగా మారుతున్నాయి. 

దరఖాస్తులు సిద్ధం చేసి పెట్టుకున్న సీనియర్లు

అప్లికేషన్ల ప్రక్రియ మొదలై ఐదు రోజులైంది. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. కానీ ఇప్పటికీ పెద్ద నేతలెవరూ అప్లికేషన్ ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన అప్లికేషన్‌‌ను సిద్ధం చేసి పెట్టినట్టు తెలిసింది. సంపత్​కుమార్, మహేశ్​కుమార్ గౌడ్ కూడా తమ అప్లికేషన్లను సమర్పించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా 306 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం 56 మంది దాకా అప్లై చేసుకున్నారు.

పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్.. కరీంనగర్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్ కుమార్ గౌడ్‌‌కు అప్లికేషన్ అందించారు. ఇదే స్థానం నుంచి సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తన అప్లికేషన్‌‌ను సమర్పించే అవకాశాలున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి దండె రాంరెడ్డి అనుచరులతో భారీగా తరలివచ్చి అప్లికేషన్ ఇచ్చారు. మరోవైపు యూత్ లీడర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

బయటోళ్లూ అప్లై

కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పార్టీలో సభ్యత్వం లేని వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రిటైర్డ్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత ప్రయత్నాలు చేస్తున్నారు. రోజూ కొందరు బయటి వ్యక్తులు అప్లికేషన్ ఫామ్‌‌ కోసం గాంధీభవన్ వర్గాలను ఆరా తీస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, చిన్న స్థాయి నేతలూ తమ లక్కును చెక్​ చేసుకోవాలనుకుంటున్నారు. వారిని పార్టీ పెద్దలు కూడా ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది.

రేవంత్, భట్టి సహా సీనియర్​నేతలకు టికెట్లు కన్ఫామ్ అనుకునే 20కిపైగా నియోజకవర్గాల నుంచీ అప్లికేషన్లను ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. జనరల్​(బీసీలకు కూడా) కేటగిరీ అభ్యర్థులకు రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25 వేలుగా అప్లికేషన్ ఫీజును ఖరారు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద నేతల స్థానాల్లోనూ టికెట్ ఆశావహులు అప్లికేషన్ వేస్తే పార్టీకి డబ్బులైనా వస్తాయన్న ఆలోచనలో నేతలు ఉన్నట్టు తెలిసింది. అలా వచ్చే ఫండ్‌‌ను పార్టీ అవసరాల కోసం వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

గాంధీభవన్‌‌లో డిజిటల్ స్క్రీన్లు!

గాంధీభవన్ బోర్డును ఇప్పటికే మార్చిన పార్టీ పెద్దలు.. తాజాగా ఆఫీసులో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అప్లికేషన్ల టైం కావడం, రోజూ కార్యకర్తలు, అనుచరులు వందలాదిగా తరలివస్తుండడంతో పార్టీ కార్యక్రమాలను వివరించేందుకు వాటిని పెట్టిస్తున్నారు. ఆఫీసులోని ఐదు చోట్ల ఇలాంటి ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ పెద్దల ప్రసంగాలు, కాంగ్రెస్ ఇచ్చే హామీలు, పార్టీ వల్ల ప్రజలకు కలిగే లాభాలు, ప్రచార కార్యక్రమాల వంటి వాటిని ఈ డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు.

దాని వల్ల పార్టీకి కార్యకర్తలు, జనాల్లో రీచ్ పెరుగుతుందని నేతలు భావిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఈ స్క్రీన్లపై వీడియోలను ప్రదర్శించనున్నారు. మంగళవారం నుంచే డిజిటల్​ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆశావహులతో అప్లికేషన్లను సమర్పించేందుకు వచ్చిన అనుచరులు డిజిటల్ స్క్రీన్లలో ప్లే అవుతున్న కంటెంట్‌‌ను ఆసక్తికరంగా చూడటం కనిపించింది.