యాదాద్రికి మూడు కొత్త గోడౌన్లు..ఒక్కో సొసైటీకి రూ.  3 కోట్లు

యాదాద్రికి మూడు కొత్త గోడౌన్లు..ఒక్కో సొసైటీకి రూ.  3 కోట్లు
  • డీసీసీబీ రుణంతో నిర్మాణం
  • 40 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మాణం

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాకు కొత్తగా మూడు గోడౌన్లు మంజూరు అయ్యాయి. వీటిని డిస్ట్రిక్​ కో ఆపరేటీవ్​ సొసైటీ ఆధ్వర్యంలోని మూడు పీఏసీఎస్​ల పరిధిలో నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం డీసీసీబీ లోన్లు ఇవ్వనుంది. 

ప్రతిపాదనలో ఆరు పీఏసీఎస్​లు..

2020 నుంచి జిల్లాలో వరి సాగు పెరిగింది. దీంతో దిగుబడి కూడా పెరిగింది. పెరిగిన దిగుబడికి అనుగుణంగా జిల్లాలోని గోడౌన్లలో ఖాళీ స్థలం లేదు. వడ్ల కొనుగోళ్ల సమయంలో నిల్వ చేయడానికి ఇబ్బందులు కలుగుతుండడం వల్ల బయట నిల్వ చేస్తున్నారు. ఈ తరుణంలో ‘వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ స్టోరేజ్ స్కీమ్’ ద్వారా పీఏసీఎస్​లు గోడౌన్లు నిర్మించడానికి అవకాశం వచ్చింది.

ఈ గోడౌన్ల నిర్మాణం కోసం సంస్థాన్​ నారాయణపురం, చందుపట్ల, గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూరు (ఎం), మోటకొండూరు పీఏసీఎస్​లలో గోడౌన్లను నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. వీటిలో లాభాల్లో ఉండడంతో పాటు రోడ్డు కనెక్టివిటీ కలిగిన వాటికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

లాభాల్లో ఉండడంతో పాటు సొంత స్థలం ఉండడంతో సంస్థాన్​ నారాయణపురం పీఏసీఎస్​ పరిధిలో గోడౌన్​​ నిర్మాణానికి డిస్ట్రిక్​ కో ఆపరేటీవ్​ డెవలప్​మెంట్​ కమిటీ దాదాపుగా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఆత్మకూరు(ఎం) సొసైటీకి రోడ్డు పక్కనే స్థలం ఉండడం, మోటకొండూరులో ప్రభుత్వ స్థలం ఉండడంతో  వీటిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే  గుండాల, చందుపట్ల, అడ్డగూడూరు సొసైటీల విషయంలో చర్చ నడుస్తోంది. 

డీసీసీబీ నుంచి లోన్..​

పీఏసీఎస్​లు నిర్మించే గోడౌన్లకు డీసీసీబీ లోన్లు మంజూరు చేయనుంది. ఒక్కో సొసైటీ పరిధిలోని గౌడౌన్​కు రూ. 3 కోట్ల వరకూ లోను ఇవ్వనుంది. అందుకే లాభాల్లో నడిచే సొసైటీలకు లోన్లు ఇస్తామని చెబుతోంది. దీంతో పాటు గోడౌన్ల నిర్మాణం తర్వాత వీటిని ఎవరు అద్దెకు తీసుకుంటారో వారి నుంచి ఒప్పందం కూడా కావాలని కోరనుంది.ఈ గోడౌన్ల నిర్మాణం పూర్తి అయితే 40 వేల టన్నుల కెపాసిటీ అందుబాటులోకి వస్తుంది.