ఆ పాపం వీళ్లదేనా : ముగ్గురు రైల్వే అధికారుల‌కు జ్యుడిషియ‌ల్ కస్టడీ

ఆ పాపం వీళ్లదేనా : ముగ్గురు రైల్వే అధికారుల‌కు జ్యుడిషియ‌ల్ కస్టడీ

భువనేశ్వర్ : బాలాసోర్ రైలు ప్రమాదంలో నిందితులుగా ఉన్న ముగ్గురు రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ గడువు ముగియడంతో ఇక్కడి ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రైల్వే శాఖ సస్పెన్షన్‌లో ఉంచిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లకు రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం (జులై 14న) సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

నిందితులను జులై 7న సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐకి ప్రత్యేక కోర్టు ఐదు రోజుల రిమాండ్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత, జూలై 11న, దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు కోర్టు రిమాండ్ వ్యవధిని మరో నాలుగు రోజులు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 27నకు వాయిదా వేసింది. ముగ్గురు నిందితులపై IPC సెక్షన్లు 304,201 (సాక్ష్యాలను నాశనం చేయడం), రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసులు నమోదు చేశారు.

బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ తన నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉంది. సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో "లాప్స్" కారణంగా ప్రమాదం జరిగిందని సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ (CRS) విచారణ నివేదిక పేర్కొంది. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ స్థిరంగా ఉన్న సరుకు రవాణా రైలును ఢీకొట్టడంతో 293 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు.