వివాహిత మహిళకు లవ్ లెటర్ రాస్తే అది కచ్చితంగా నేరమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళకు తన క్యారెక్టరే విలువైందని కోర్టు తెలిపింది. ప్రేమ పేరుతో పెళ్లైన మహిళకు లెటర్ పంపటమంటే ఆమెను అవమానించినట్లేనంది. పెళ్లైన మహిళకు లవ్ లెటర్ రాసిన వ్యక్తికి బాంబే హైకోర్టులోని నాగ్ పూర్ ధర్మాసనం రూ.90వేల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది.
2011లో నాగపూర్‌లో కిరాణ షాప్ నడిపే వ్యక్తి అక్కడ పనిచేసే పెళ్లయిన మహిళకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో లవ్ లెటర్‌ను ఆమెపైకి విసిరేశాడు. ఆ తర్వాత రోజు కూడా ఇదే విధంగా చేయటంతో బాధితురాలు అకోలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018లో సెషన్స్ కోర్టు నిందితునికి రెండేళ్ల కారాగార శిక్ష, రూ. 40 వేలు జరిమానా విధించింది. తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. బాధిత మహిళపైనే ఆరోపణలు చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని అడిగినందుకే ఇలా తప్పుడు ఆరోపణలు చేసిందంటూ హైకోర్టులో తెలిపాడు. అయితే.. ఈ కేసులో పక్కా ఆధారాలుండటంతో అతడి వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అప్పటికే నిందితుడు 45 రోజుల పాటు జైలులో ఉన్నందున జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించింది. జరిమానా మాత్రం రూ. 90వేలకు పెంచింది. అందులో బాధితురాలికి రూ.85 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
