మిస్ వరల్డ్ పోటీలకు ఒకరోజు ముందే..హైదరాబాద్లో హైఅలర్ట్!

మిస్ వరల్డ్ పోటీలకు ఒకరోజు ముందే..హైదరాబాద్లో హైఅలర్ట్!
  • మిస్ వరల్డ్ పోటీలకు పటిష్ట భద్రత కట్టుదిట్టం
  • 120 దేశాల నుంచి ప్రతినిధులు, పార్టిసిపేంట్స్
  • పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అణువణువూ తనిఖీ
  • మే 12న చార్మినార్ టు చౌమహల్లా ప్యాలెస్ హెరిటేజ్ వాక్
  • ఆరోజు చార్మినార్‌, లాడ్‌బజార్‌, మోతీగల్లి, చౌమహల్లా ప్యాలెస్‌ వరకు సాయుధ బలగాలు
  • గాజులు, ముత్యాల దుకాణాల వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు
  • 13న సాంస్కృతిక ప్రదర్శనలు జరిగే చౌమహల్లా ప్యాలస్‌ వద్ద కూడా భద్రత
  • సిటీలోని మూడు కమిషరేట్లతోపాటు పోటీదారులు పర్యటించే నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భద్రతపై వరుస సమీక్షలు

హైదరాబాద్:  మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలకు హైదరాబాద్లో హై అలెర్ట్ అయ్యింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 120 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్కు హాజరు కాబోతున్నారు. 

వారితో 116 దేశాల నుంచి ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. నిన్న  మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌, సీఈవో జూలియా ఈవేలిన్‌ మోర్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి ఆమె  కూడా ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పాతబస్తీలోనూ పార్టిసిపేంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.  

మే 13న చార్మినార్‌, లాడ్‌బజార్‌, మోతీగల్లి తదితర ప్రాంతాల్లో పార్టిసిపేంట్స్ హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఇందుకోసం సాయుధ బలగాలు ఆయా ప్రాంతాలను ఒక రోజు ముందే ఆధీనంలోకి తీసుకోనున్నాయి. వాళ్లు హెరిటేజ్ వాక్ చేసే ప్రాంతంలోని ఎంపిక చేసిన గాజులు, ముత్యాలు, నగల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఆయా దుకాణాల యజమానులు, వాటిల్లో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని హెరిటేజ్‌ వాక్‌ సమయంలో లోపలికి అనుమతించరు. 

అదే రోజు  రాత్రి  చౌమహల్లా ప్యాలస్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు, రాత్రికి వెల్కం డిన్నర్‌ ఏర్పాట్లు చేయనున్నారు.  చౌమహల్లా ప్యాలెస్  లోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తారు.  అందులో పనిచేసే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఈ డిన్నర్ ఈ వెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 14న హెరిటేజ్ టూర్ లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. 

అక్కడే తెలంగాణ వారసత్వ నృత్యమైన పేరిణి శివతాండవాన్ని వీక్షిస్తారు. రామప్ప ఆలయం వద్ద ముందు నుంచే భారీ భధ్రత ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్ వరంగల్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మరుసటి రోజు యాదగిరి గుట్టను, చేనేతలకు నెలవైన పోచంపల్లిని  సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనేట్ కూడా అలెర్టయ్యింది. దీంతోపాటు బుద్ధవనం  సందర్శించనున్నందున నల్లగొండ పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ సూచించారు. 

మూడు కమిషనరేట్ల పరిధిలో హై అలెర్ట్

హైదరాబాద్  నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్టిసిపేంట్స్, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు, ప్రపంచ ప్రసిద్ధ ఫొటో గ్రాఫర్లు విడిది చేసే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు  నిర్వహించనున్నారు. పోటీలు జరుగుతున్న సమయంలో  ప్రపంచం దృష్టంతా హైదరాబాద్ వైపే ఉంటుంది. ఈ తరుణంలో ఈ చిన్న పొరపాటు కూడా జరగొద్దనే భావనతోనే పోలీసులు అలెర్టయ్యారు.