డ్యూటీలోకి వెళ్లాలంటూ సీనియర్ అధికారుల రిక్వెస్ట్
‘తీస్ హజారీ కోర్టు ఘటన’పై ఢిల్లీ పోలీసుల నిరసనలు
భార్య, పిల్లలతో కన్నా డబుల్ టైం డ్యూటీలోనే ఉంటాం
శాంతి భద్రతల్ని కాపాడేది మనమే.. న్యాయం చేస్తాం
విధుల్లోకి వెళ్లండి: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు
నిరసనలతో ఢిల్లీ – చండీగఢ్ హైవేపై ట్రాఫిక్ జామ్
దేశవ్యాప్తంగా పోలీసు సంఘాల నుంచి మద్దతు
దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత ఆగిన నిరసనలు
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు దగ్గర నవంబరు 2న లాయర్లు, పోలీసుల మధ్య జరిగిన కొట్లాట ఘటన చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొట్లాటలో రెండు వర్గాల వారూ గాయపడినప్పటికీ ఢిల్లీ హైకోర్టు కేవలం పోలీసులపైనే యాక్షన్ తీసుకోవడంపై పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ధర్నాకు దిగారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటలు దాటినా నిరసనలు ఆగలేదు. వారిని శాంతింపజేయడానికి సీనియర్ అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు 10 గంటల పాటు హైడ్రామా తర్వాత నిరసనను విరమించి విధుల్లోకి వెళ్లారు పోలీసు సిబ్బంది.
చట్టం, న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి
నవంబరు 2న తీస్ హజారీ కోర్టు దగ్గర పార్కింగ్ చేసేటప్పుడు ఓ పోలీసు, లాయర్ వాహనాలు ఢీకొనడంతో వివాదం మొదలైంది. ఇద్దరూ చట్టం, న్యాయం తెలిసిన వాళ్లే అయినా ఆవేశంలో కొట్లాట దాకా వెళ్లారు. అది కాస్తా పోలీస్, లాయర్.. రెండు వర్గాల పోరుగా మారింది. దాదాపు వంద మందికి పైగా అక్కడ గుమ్మికూడి కొట్టుకున్నారు. ఒకదశలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. కాల్పులు కూడా జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా (రెండు వర్గాల వారూ ఉన్నారు) తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టులో ఆదివారం జరిగిన విచారణలో లాయర్లకు పూర్తిగా లాయర్లకు పక్షపాతంగా ఆదేశాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు. పోలీసుల్ని మాత్రమే సస్పెండ్ చేసి, లాయర్లపై ఏ యాక్షన్ తీసుకోలేదని చెబుతున్నారు. పరిహారం కూడా వారికి మాత్రమే ఇవ్వాలన్న ఆదేశాలు వచ్చాయంటున్నారు. చట్టం, నాయ్యం అన్నది అందరికీ ఒకేరకంగా ఉండాలంటూ మంగళవారం మధ్యాహ్నం నిరసనకు దిగారు పోలీసులు.
చాలా పోలీస్ స్టేషన్లు ఖాళీ
తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ధర్నాకు దిగారు పోలీసు సిబ్బంది. వేలాది మంది తమ విధులను బహిష్కరించి అక్కడికి చేరారు. వారి నిరసనతో ఢిల్లీలోని చాలా పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయం వరకూ కూడా నిరసన విరమణ జరగలేదు. పోలీసుల కుటుంబసభ్యులు కూడా నిరసనలు చేపట్టారు. ఢిల్లీ-చండీగఢ్ హైవేపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. మరోవైపు పోలీసుల భార్య, పిల్లలు భారీగా ఇండియా గేట్ వద్దకు తరలి వెళ్లి.. క్యాండిల్ ర్యాలీలు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులకు తమిళనాడు, బిహార్, కేరళ సహా పలు రాష్ట్రాల పోలీస్, ఐపీఎస్ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

రూ.25 వేల పరిహారం ప్రకటన
తీస్ హజారీ కోర్టు ఘటన బాధితులకు న్యాయం చేస్తామని, పోలీసులపై దాడి చేసిన వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ సీపీ అమూల్యా పట్నాయక్ చెప్పారు. నిరసనలు విరమించి విధుల్లోకి వెళ్లాలని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సతీశ్ గోల్చా కోరారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందేలా చూస్తామని, రూ.25 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు.
సుప్రీం కోర్టుకు వెళ్తాం
నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది డిమాండ్లన్నీ అంగీకరిస్తున్నామని అన్నారు జాయింట్ కమిషనర్ దేవేశ్ శ్రీవాస్తవ అన్నారు. దయ చేసి విధుల్లోకి వెళ్లాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారాయన.
‘శాంతి భద్రతలు కాపాడే విధిలో మనం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. భార్య, పిల్లలతో గడిపిన సమయం కన్నా డబుల్ టైం డ్యూటీలోనే ఉన్నాం. కుటుంబాలతో పండుగలు, వేడుకలు కూడా జరుపుకున్నది లేదు. శాంతి భద్రతలను కాపాడేది మనమే. లా అండ్ ఆర్డర్ నిలడాలంటే మనం పని చేయాలి. దయ చేసి విధుల్లోకి వెళ్దాం’ అంటూ పిలుపునిచ్చారు జాయింట్ కమిషనర్ రాకేశ్ ఖురానా. సీనియర్ అధికారుల హామీలతో ఎట్టకేలకు మధ్యాహ్నం నుంచి దాదాపు పదిగంటల పాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. పోలీసు సిబ్బంది అంతా నిరసనలను ఆపి.. డ్యూటీలోకి వెళ్లారు.

