- పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మళ్లీ సీమాంధ్ర నేతల కుట్రలు: టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణలో 12 ఏండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ మండిపడ్డారు. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. టీజేఎఫ్ ఏర్పాటై 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గన్ పార్క్ వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ 12 ఏండ్ల తర్వాత ఆంధ్ర నేతల విగ్రహాలను హైదరాబాద్‌లో పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో సమైక్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అని, టీజేఎఫ్ మరోసారి తన కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నాడని, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు ఎ.రమణ కుమార్, కందుకూరి రమేశ్‌బాబు, రమేశ్ హజారి, యార నవీన్ కుమార్, గుంటిపల్లి వెంకట్, కడకంచి వెంకటేశ్, ధన్ రాజ్, రాకేశ్‌రెడ్డి, బాపు రావు, బిజిగిరి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
