ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం అయ్యిందని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ అస్తిత్వం మసకబారింది. ఆ కుటుంబం చేతిలో నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఆగం అయ్యింది. LRS పేరుతో రియల్ ఎస్టేట్ వ్యవస్థను దెబ్బ తీశారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. ప్రజల అవసరాలు, కష్టాలు గుర్తించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ప్రగతి భవన్‌కు పరిమితమయి ప్రజలకు అందుబాటులో లేని పాలన నడుస్తోంది. కాంట్రాక్టర్లకు, కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో మార్పు అనేది చాలా అవసరం. పాలన, రాజకీయాలు మారాలి. అధికార పార్టీ వారు డబ్బు బలంతో గెలవాలని చూస్తున్నారు. కానీ అది నెరవేరదు. నిరంకుశ పాలనను ఓడించి, ప్రజాస్వామ్య ఆకాంక్షను గెలిపించాలి. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్లి ఈ నిరంకుశ పాలన నుంచి ప్రజలను కాపాడుదాం. అధికార పార్టీ నైతికంగా ఓడిపోయింది. ఆ పార్టీ అభ్యర్థి పోటీకి సుముఖంగా లేకున్నా.. ఒత్తిడి తెచ్చి పోటీకి దించారు. అందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. మనల్ని మర్చిపోయిన ఈ ప్రభుత్వాన్ని ఈసారి మనం కూడా మర్చిపోదాం’ అని ఆయన అన్నారు.
