బీసీ రిజర్వేషన్లపై కేంద్ర వైఖరి అప్రజాస్వామికం : టీజేఎస్

బీసీ రిజర్వేషన్లపై కేంద్ర వైఖరి అప్రజాస్వామికం : టీజేఎస్
  • నేడు రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై కేంద్ర ప్రభుత్వ తీరు అప్రజాస్వామికమని టీజేఎస్ ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ ఆరోపించారు.  అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే పార్లమెంట్‌‌లో ఆమోదించి, తొమ్మిదవ షెడ్యూల్‌‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో శనివారం  “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు – కేంద్ర ప్రభుత్వ వైఖరి” పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

బీసీ సంఘాల నేతలు, మేధావులు, పౌరసంఘాల ప్రతినిధులు పాల్గొని, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన విధానాలపై చర్చ జరగనుందని తెలిపారు. కేంద్రం బీసీ  రిజర్వేషన్ల బిల్లు ఆమోదంలో జాప్యం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమగ్ర హక్కులు అందించాలంటే రిజర్వేషన్లు అత్యంత కీలకమని పల్లె వినయ్ కుమార్ తెలిపారు.