V6 News

మళ్లీ వచ్చేది బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే హరీశ్ రావు

మళ్లీ వచ్చేది బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే హరీశ్ రావు
  • రేవంత్​ జేజమ్మ దిగొచ్చినా ఆపలేరు:  హరీశ్‌‌రావు
  • కేసీఆర్​ మాట విని తప్పులు దిద్దుకుంటే కాంగ్రెస్‌‌కు కనీసం డిపాజిట్లు దక్కుతయ్​
  • కాళేశ్వరం అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే ఢిల్లీకి వెళ్లామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా వచ్చేది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​లీడర్​ హరీశ్‌‌‌‌రావు అన్నారు. రేవంత్​ జేజమ్మ దిగివచ్చినా ఆపలేరని, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్​ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు కనీసం డిపాజిట్లయినా దక్కుతాయని హితవు పలికారు. ఎన్ని డ్రామాలు ఆడినా సీఎంగా రేవంత్‌‌‌‌కు నూకలు చెల్లాయని, మళ్లీ సీఎం అయ్యే పరిస్థితి లేదని అన్నారు. 

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్నాడని.. ఆ స్టే వెకేట్ అయిందంటే సీఎం సీటు ఊడి జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో  హరీశ్‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే కేసీఆర్​ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకు తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని పేర్కొన్నారు. 

రేవంత్ రెడ్డి మాత్రం తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడారని, విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారని మండిపడ్డారు. కేసీఆర్​ స్టేట్స్‌‌‌‌మన్​లాగా మాట్లాడితే.. రేవంత్​ స్ట్రీట్‌‌‌‌మన్‌‌‌‌లా మాట్లాడారన్నారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏ విధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని, దాంతోపాటు మే 6న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు తీర్పు రాబోతున్న నేపథ్యంలోనే సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీకి వెళ్లామని తెలిపారు. 

బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని గుర్తు చేశారు. పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్‌‌‌‌రెడ్డి అని, ఈరోజు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లయింట్‌‌‌‌ కూడా ఆయనేనని విమర్శించారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు భయపడి రైతు భరోసా వేస్తుండు

ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్‌‌‌‌రెడ్డి.. కేసీఆర్​ జగిత్యాల సభకు భయపడి రాత్రికిరాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని హరీశ్‌‌‌‌రావు అన్నారు. కేసీఆర్​ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయవా? అని ప్రశ్నించారు. రైతు భరోసా కేవలం కేసీఆర్​ సభను డైవర్ట్​ చేయడానికి చేసిన పొలిటికల్​ జిమ్మిక్కేనని, రూ.5 వేల కోట్లు వేయాల్సి ఉండగా.. ఇంకో రూ.4 వేల కోట్ల బకాయిలున్నాయని ఆరోపించారు. వడ్లు కల్లాలకు వచ్చినా పూర్తిస్థాయిలో రైతు భరోసా వేయలేదని అన్నారు. 

సూపర్ ఎల్ నినో వల్ల కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రేవంత్‌‌‌‌కు సోయి వచ్చిందని, అందుకే మేడిగడ్డను రిపేర్​ చేసి వాడుకుంటామంటున్నారని చెప్పారు. రెండు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్ట్​ కొట్టుకుపోయినట్టా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఏ, బీలు తెలవని రేవంత్‌‌‌‌రెడ్డి.. ఎల్లంపల్లిని తామే కట్టామంటూ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా తన పేరుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.