హల్దియా: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం పుర్బా మేదినీపూర్ జిల్లాలోని హల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలవదని, మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. బెంగాల్‌లోనే కాదు ఢిల్లీ నుంచి కూడా బీజేపీని తరిమికొడతామని ధీమా వ్యక్తం చేశారు.
నెల రోజులుగా తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, ప్రజల నాడి తనకు అర్థమైందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విడుదల చేసిన 'ఛార్జ్‌షీట్'ను ఆమె తిప్పికొట్టారు. హల్దియా డాక్ కాంప్లెక్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో బీజేపీ నేతలు కమీషన్ల దందాకు పాల్పడుతున్నారని, వారిపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నానని ఎద్దేవా చేశారు.

