- ఇండ్లు ఇప్పిస్తానంటూ టీఎంసీ నేత షాహిదుల్ మియా వసూళ్లు
- డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఇంటిని ముట్టడించిన గ్రామస్తులు
- షాహిదుల్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు
కోల్ కతా: తమ నుంచి వసూలు చేసిన కట్ మనీ వెనక్కివ్వాలని ప్రజలు ఇంటిని ముట్టడించడంతో పశ్చిమ బెంగాల్‌లో ఓ టీఎంసీ నేత భయంతో మంచం కింద దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి అతన్ని మంచం కింద నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కూచ్‌బీహార్ జిల్లాలోని మఠభంగా ప్రాంతానికి చెందిన సహిదుల్ మియా అనే టీఎంసీ నాయకుడు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పి ఒక్కో కుటుంబం నుంచి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇలా ఊళ్లో వారి నుంచి మొత్తం దాదాపు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు చెప్తున్నారు. అయితే డబ్బులు చెల్లించిన వారికి ఇండ్లు మంజూరు కాకపోవడంతో.. మే 25వ తేదీ నుంచి గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు. బుధవారం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అతని ఇంటి వద్దకు చేరుకుని డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సహిదుల్ మియా ఇంట్లోని ఓ గదిలో మంచం కింద దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని బయటకు తీసి స్టేషన్‌కు తరలించారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో టీఎంసీ నాయకులపై అవినీతి, వసూళ్లు, బెదిరింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ బిశ్వజిత్ మండల్‌ను మహిళపై దాడి, వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు. జూన్ 2న కౌన్సిలర్లు అరిజిత్ దాస్ ఠాకూర్ (వార్డు 106), సచిన్ సింగ్ (వార్డు 36) లను కట్‌మనీ వసూళ్ల కేసుల్లో అరెస్ట్ చేశారు.
