కోల్కతా: ఎన్నికల సంఘంపై టీఎంసీ ఎమ్మెల్యే మొనిరుల్ ఇస్లాం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే(సర్) ప్రక్రియ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తో పాటు ఎన్నికల సంఘం కమిషనర్లపైనా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్ పాతాళంలో దాక్కున్నా లాక్కొచ్చి కొడతానని, అలాగే ఈసీ కమిషనర్లను కూడా లాఠీలతో నడ్డి విరగ్గొడతానని బెదిరించారు. బీజేపీని సంతృప్తిపరచడానికి బెంగాల్ ప్రజలతో ఈసీ చెలగాటం ఆడుతోందని విమర్శించారు.
‘‘ఏసీ రూముల్లో కూర్చుని బీజేపీకి అనుకూలంగా ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నది. బీజేపీకి ఓ ఏజెంట్ గా మారింది. సర్ తో బెంగాల్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జ్ఞానేశ్ కుమార్.. నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొచ్చి కొడతా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అలాగే ఈసీని కూడా లాఠీలతో నడ్డి విరగ్గొడతా” అని ఇస్లాం హెచ్చరించారు. కాగా.. సర్ ప్రక్రియ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య గత కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.
