కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కౌంటింగ్ సూపర్ వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను టీఎంసీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు శనివారం (మే 2) అత్యవసరంగా విచారణ చేపట్టనుంది.
2026, మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అయితే, ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూల) ఉద్యోగులను మాత్రమే నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలను అధికార టీఎంసీ పార్టీ కోల్కతా హైకోర్టులో సవాల్ చేసింది. టీఎంసీ పిటిషన్ను కోల్కతా హైకోర్టు తిరస్కరించింది.
కేంద్ర ప్రభుత్వ/పీఎస్‌యూ ఉద్యోగులను కౌంటింగ్ సూపర్ వైజర్లుగా నియమించే విచక్షణ అధికారం ఎన్నికల సంఘానికి ఉందని.. అది చట్ట విరుద్ధం కాదని హైకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది రాజకీయ ప్రభావంతో పనిచేస్తారనే పిటిషనర్ ఆందోళనను కోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని.. అవి కేవలం అనుమానాలు మాత్రమేనని పేర్కొంది.
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీఎంసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సూపర్ వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే విధించాలని టీఎంసీ కోరింది. ఈసీ నిర్ణయం నిష్పక్షపాతతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇది సమర్థవంతంగా మినహాయిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది.
మే 4న కౌంటింగ్ ఉండటంతో తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని టీఎంసీ అభ్యర్థించింది. టీఎంసీ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. శనివారం (మే 2) ఉదయం 10.30 గంటలకు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో ప్రత్యేక విచారణ జరగనుంది. సీజేఐ సూర్యకాంత్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ఈ ధర్మాసనం విచారణ జరపనుంది.
