- నేడే కవిత కొత్త పార్టీ మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో ఆవిర్భావ సభ
- పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్న కవిత
- పలువురు నేతలు చేరే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేడు మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత.. కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియలో కవిత అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ జెండా, ఎజెండా సహా ప్రతి అంశంపై నిపుణులతో చర్చలు జరిపారు. ఉద్యమకారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలో ఇటు రాజకీయ విశ్లేషకులతోనూ సమాలోచనలు జరిపారు. పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తోనూ చర్చలు జరిపారు. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, పార్టీ ఎజెండా ఏముండాలి.. వంటి అంశాలపై పీకేతో ఆమె చర్చించారు. ఆ మీటింగ్తర్వాతే జాగృతిలోనే కొన్ని టీములు వేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎజెండా రూపకల్పన చేశారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ జెండాలో ‘నీలి’ రంగును ఖరారు చేశారు. టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని ఆమె చెప్పినా.. ఆ పేరు వచ్చే చాన్స్ లేదని భావించి కొత్త పేరును ఖరారు చేసినట్టు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొని.. టికెట్లు దక్కని సీనియర్ నేతలపై కవిత దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు జాగృతిలో చేరారు. అదే బాటలో మరిన్ని చేరికలు ఉంటాయని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీలో కొందరు సీనియర్ నాయకులతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామంటున్నారు. గాంధీజీ సర్వోదయ కాన్సెప్ట్ ఆధారంగానే తమ పార్టీ ఎజెండా ఉంటుందని తేల్చి చెప్పారు.
గతేడాది మేలో మొదలు..
నిరుడు మేలో బీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్డేకి అమెరికాకు వెళ్లి వచ్చాక.. మే 23న ఎయిర్‌పోర్టు వద్దే సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కేటీఆర్, హరీశ్ రావును టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన తెల్లారే కేటీఆర్ కూడా పార్టీలో రేవంత్ కోవర్టులున్నారంటూ కామెంట్ చేశారు. చెల్లె నోటి నుంచి దెయ్యాలు.. అన్న నోటి నుంచి కోవర్టులు అనే వ్యాఖ్యలు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న చర్చ రాజకీయవర్గాల్లో జరిగింది. ఈ క్రమంలోనే హరీశ్ రావుపైనా ఆరోపణలు చేశారు. తర్వాత కవితను సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టారు. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. అది అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. దీంతో ఆమె హెచ్ఎంఎస్కు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేశారు. అది మొదలుకొని జాగృతిని బలోపేతం చేస్తూ వచ్చారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోకి వెళ్లేలా బహుజనవాదాన్ని కవిత ఎత్తుకున్నారు. అదే సమయంలో సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో నిరుడు సెప్టెంబర్ 2న ఆమెను పార్టీ నుంచి హైకమాండ్ సస్పెండ్ చేసింది. కేసీఆర్ ఆదేశాలతోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాతి రోజు ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఇప్పటికీ నోరెత్తని కేసీఆర్
బీఆర్ఎస్తోపాటు కుటుంబానికీ కవిత దూరమయ్యారని చెప్పేందుకు రాఖీ పండుగ ఉదాహరణగా నిలిచింది. రాఖీ కట్టేందుకు వస్తున్నానని కేటీఆర్ కు కవిత మెసేజ్ పెట్టినా.. ఆయన స్పందించలేదు. ఔటాఫ్ టౌన్ వెళ్లిపోయారు. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య బంధానికి బీటలు వారాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఇక, కవిత ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు. కేసీఆరే కాదు.. కేటీఆర్, హరీశ్ రావు ఎక్కడా ఆమె వ్యాఖ్యలపై స్పందించలేదు. అంతర్గత సమావేశాల్లో ముగ్గురి మధ్య చర్చ నడిచినా.. బహిరంగంగా ఎక్కడా కవిత గురించి మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించడం వల్లే ఎవరూ దానిపై స్పందించలేదన్న చర్చ నడిచింది.
సర్కార్ కుట్రలను చూడలేకే శంకర్‌గౌడ్ ఆత్మహత్య: కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి నర్సంపేట డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శంకర్ గౌడ్ బలయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డా రు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర తీయడంతో కార్మికులు సమ్మెకు వెళ్లారని, సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను చూడలేక శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని చనిపోయారని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కంచన్ బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్‌ను పరామర్శించకుండా ఆస్పత్రి వద్ద ప్రభుత్వం అడ్డుకున్నదన్నారు. శంకర్ గౌడ్‌ది ప్రభుత్వం చేసిన హత్యేనన్నారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థలో యూనియన్ల పునురుద్ధరణ సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ఆమె పేర్కొన్నారు.
అట్టహాసంగా ఏర్పాట్లు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా, మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్‌ను ఆనుకుని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని కవిత ప్రకటించనున్నారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, ఇతర ద్వారాలకు రాణి రుద్రమ దేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లు పెట్టారు. వీటితోపాటు సురవరం ప్రతాపరెడ్డి, సమ్మక్క సారలక్క, షోయబుల్లా ఖాన్ పేర్లతో మూడు భోజనశాలలు ఏర్పాటుచేశారు.
34 రకాల తెలంగాణ వంటకాలు..
అతిథులకు 34 రకాల తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. నాన్ వెజ్‌లో తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయిల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు, వెజిటేరియల్ లో బగరా బైగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు సిద్ధం చేస్తున్నారు. వీటితోపాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనూలో చేర్చారు. బగరా రైస్, వైట్ రైస్, సాంబర్, రోటీ పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా, మజ్జిగ, రాగి అంబలి అందుబాటులో ఉంటాయి. ఇక డిజర్ట్ లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహి తుక్ డా, జిలేబీ రుచి చూపించనున్నారు.
ఇదీ షెడ్యూల్..
- శనివారం ఉదయం 7.30 గంటలకు కవిత బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరుతారు.
- 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. 8.25కు అక్కడి నుంచి బయల్దేరుతారు.
- 9.30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటారు.
- 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
- 10.05 గంటలకు ప్రసంగం ప్రారంభించి, గంటన్నర పాటు మాట్లాడనున్నారు.

