V6 News

టమాట కిలో @ 4..మళ్లీ పతనమైన ధరలు

టమాట కిలో @ 4..మళ్లీ పతనమైన ధరలు
  • ఏపీ, కర్నాటక నుంచి వస్తుండడంతో తగ్గిన రేట్లు
  • రోడ్ల పక్కన పారబోస్తున్నరు

మహబూబ్​నగర్​, వెలుగు: టమాట రేటు రోజురోజుకూ పడిపోతోంది. మార్కెట్​లో కిలోకు రూ.4 కు మించి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూలి, రవాణా  ఖర్చులు భరించి మార్కెట్​కు తెస్తే కొనేందుకు వ్యాపారులు ముందుకురాకపోవడంతో మార్కెట్​లో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున టమాట రావడం వల్లే లోకల్​ టAమాటాలకు గిరాకీ లేకుండా పోతోందని, దీంతో తాము రెక్కల కష్టానికి మునుగుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

 రెండేళ్లుగా ఇదే పరిస్థితి.. 

మహబూబ్​నగర్​ జిల్లాలో రెండేళ్లుగా టమాట రైతులకు గిట్టుబాటు అయితలేదు. ఈ సీజన్​లో జిల్లాలోని బాలానగర్​, నవాబ్​పేట, గండీడ్​, మిడ్జిల్​, మహమ్మదాబాద్​, హన్వాడ, మహబూబ్​నగర్ మండలాల్లోని దాదాపు 500 ఎకరాల్లో రైతులు టమాట సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు చేతికి వస్తుండడంతో మార్కెట్లకు తరలిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ, కర్ణాటక నుంచి లారీలకొద్దీ టమాటను  స్థానిక వ్యాపారులు తక్కువ రేట్లకే దిగుమతి చేసుకుంటున్నారు.

దీనికి లోకల్​ టమాట తోడై రేట్లు పడిపోతున్నాయి. మూడు రోజుల కింద 25 కేజీల టమాట బాక్సు రూ.180 పలకగా, శుక్రవారం కేవలం రూ.100 లోపే పలికింది. కిలో కు  రూ.4 మాత్రమే వస్తుండడం, వాటిని కూడా కొనకపోవడంతో పలువురు రైతులు మార్కెట్లలో, రోడ్ల పక్కన టమాటలు పారబోసి వెళ్లిపోయారు. గతేడాది ఇదే టైంలో టమాట రేట్లు పతనమయ్యాయి. కిలోకు రూ.3 నుంచి రూ.5 మాత్రమే పలకడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులను అరికట్టి, న్యాయం జరిగేలా చూస్తామని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.