V6 News

Rohit Sharma: "బర్త్ డే భాయ్" రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్.. కోహ్లీ, సచిన్ వల్ల కూడా కాలేదుగా

Rohit Sharma: "బర్త్ డే భాయ్" రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్.. కోహ్లీ, సచిన్ వల్ల కూడా కాలేదుగా

Rohit Sharma: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్స్ లలో ఒకరైన హిట్ మ్యాన్, రోహిత్ శర్మ నేడు తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. స్టేడియంలో పరుగుల వరద పారించడమే కాదు, కెప్టెన్‌గా టీమిండియాకు ప్రపంచ కప్‌లను అందించిన ఈ 'హిట్‌మ్యాన్' పేరిట కొన్ని అద్భుతమైన రికార్డులు కూడా ఉన్నాయి. ఆధునిక క్రికెట్‌లో వాటిని అధిగమించడం ఇప్పటి వరకు ఏ బ్యాటర్‌కైనా అంత సులభం కాదు. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. 

డబుల్ సెంచరీల కింగ్: వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే గగనమైన వేళ, రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు ఈ రికార్డుని సాధించి చరిత్రలోకి ఎకెక్కాడు. ఆస్ట్రేలియాపై ఒకసారి, శ్రీలంకపై రెండుసార్లు డబుల్ సెంచరీలు కొట్టి 'డబుల్ సెంచరీల కింగ్' అని పిలుపించుకున్నాడు. వరల్డ్ లో మరే ఇతర బ్యాటర్ కూడా ఇప్పటి వరకు ఈ స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. 

వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు: ప్రపంచ కప్ లాంటి భారీ టోర్నీలలో రోహిత్ శర్మ ప్రదర్శన అమోఘం.. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికంగా 7 సెంచరీలు కొట్టిన రికార్డు అతడి పేరుపైనే ఉంది. ఈ క్రమంలో ఆయన సాక్షాత్తు సచిన్ టెండూల్కర్ ఘనతని కూడా అధిగమించాడు. ముఖ్యంగా 2019 వరల్డ్ కప్‌లో ఒకే టోర్నీలో 5 శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు: క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రికార్డు రోహిత్ శర్మ పేరుపైనే ఉంది. 2014లో కోల్‌కతా వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 264 రన్స్ సాధించి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడి.. ఈ మైలురాయిని చేరుకోవడం ప్రస్తుత తరం ప్లేయర్స్ కి ఒక కలగానే మిగిలిపోయింది.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సిక్సర్ల రారాజు: సిక్సర్లు బాదడంలో రోహిత్ శర్మకు సాటి ఎవరూ రాలేడు.. క్రికెట్ 3 ఫార్మాట్లలో కలిపి మొత్తం 650కి పైగా సిక్సర్లు బాది వరల్డ్ లోనే అగ్రస్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరుపై ఉన్న ఘనతని తుడిచి పెట్టిన హిట్ మ్యాన్, తన అద్భుతమైన టైమింగ్‌తో 'సిక్స్ మెషీన్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అన్ని ఫార్మాట్లలో మూడుకు పైగా శతకాలు: టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా మూడు విభాగాల్లోనూ కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు బాదిన ఏకైక భారతీయ బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 12, టీ20ల్లో 5, వన్డేల్లో 33 సెంచరీలు కొట్టి అన్ని ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అయితే రోహిత్ కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు, భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చాడు. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి తన కెప్టెన్సీలో చెరగని ముద్ర వేశాడు. రోహిత్ శర్మ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ V6 తెలుగు న్యూస్ ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు..!