హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్‌లో జరిగే పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు టాస్ డైరెక్టర్ కె. లింగయ్య షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆగస్టు 17 వరకు ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఆగస్టు 18 నుంచి 24 వరకు రూ.25, ఆగస్టు 25 నుంచి 29 వరకు రూ.50 లేట్ ఫీజ్‌తో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తత్కాల్ పథకం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని, చలాన్లు, డీడీల రూపంలో దరఖాస్తులు అంగీకరించబోమని అధికారులు తెలిపారు. గతంలో ఫెయిల్ అయినవారు, వివిధ కారణాలతో పరీక్షలు రాయకపోయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు, పరీక్షల షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని, విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.
