తప్పుగా అర్థం చేసుకున్నరు: యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ

తప్పుగా అర్థం చేసుకున్నరు: యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ

న్యూఢిల్లీ: యువతను ఉద్దేశిస్తూ బొద్దింకలు అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీజేఐ వ్యాఖ్యలు దేశ యువతను కించపర్చేలా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. మీడియాలోని ఒక వర్గం తన వ్యాఖ్యలను వక్రీకరించి వాటిని దేశ యువతపై విమర్శగా తప్పుగా చిత్రీకరించిందని అన్నారు. తాను యువతను విమర్శించలేదని.. కేవలం ఫేక్ డిగ్రీలతో వివిధ రంగాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్న వారినే బొద్దింకలతో పోల్చానని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. 

‘‘ఒక పనికిమాలిన కేసు విచారణ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిన తీరు చదివి బాధపడ్డాను. నకిలీ, బూటకపు డిగ్రీల సహాయంతో బార్ (న్యాయవాద వృత్తి) వంటి వృత్తులలోకి ప్రవేశించిన వారిని నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వ్యక్తులే మీడియా, సోషల్ మీడియా, ఇతర ఉన్నత వృత్తులలోకి కూడా చొరబడ్డారు.

అలాంటి వారు పరాన్నజీవుల వంటివారు. నేను మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారమైనది’’ అని సీజేఐ వివరణ ఇచ్చారు. దేశ యువత పట్ల తాను గర్వపడుతున్నానని.. అభివృద్ధి చెందిన భారతదేశానికి వారు మూలస్తంభాలని అభివర్ణించారు. భారతదేశంలోని ప్రతి యువకుడు నాకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. భారత యువత పట్ల తనకు గొప్ప గౌరవం, మర్యాద ఉన్నాయని తెలిపారు.