కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునే వారికి కొన్ని కండీషన్స్

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునే వారికి కొన్ని కండీషన్స్

కాంగ్రెస్ పార్టీ ఓవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ఈనెల 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటిసారిగా డిజిటల్ మెంబర్ షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఐతే పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి కొన్ని కండీషన్లు కూడా పెట్టింది పీసీసీ.

గ్రౌండ్ లెవల్ లో పార్టీని పటిష్టం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది రాష్ట్ర కాంగ్రెస్. ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో 30లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీ 80 లక్షల సభ్యత్వాలను రీచ్ అయ్యింది. టీఆర్ఎస్ కు ధీటుగా మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ మెంబర్ షిప్ విధానం తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ మొబైల్ లో మెంబర్ షిప్ చేసుకునేలా సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి నేతలే కాకుండా.. సీనియర్ నేతలైన సరే.. వారివారి నియోజకవర్గాల్లో డిజిటల్ మెంబర్ షిప్ చేయాల్సిందే. దీనిపై అవగాహన కోసం ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల, గ్రామ, బ్లాక్ స్థాయి నాయకులకు శిక్షణ ఇవ్వనుంది పీసీసీ. సిటీ శివారులోని కొంపల్లి ప్రాంతంలో ఈ ట్రైనింగ్ క్లాసులకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు.

తూతూమంత్రంగా కాకుండా డిజిటల్ మెంబర్ షిప్ ను సీరియస్ గా తీసుకోవాలని పీసీసీ డిసైడైంది. ప్రతి బూత్ లెవల్ లో 100 మందికి డిజిటల్ మెంబర్ షిప్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. డిజిటల్ మెంబర్ షిప్ లో.. సభ్యత్వం తీసుకునే వారి ఫొటో, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ వివరాలను ఎంట్రీ చేస్తారు. సభ్యత్వం తీసుకునే వారి మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే.. డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియ పూర్తవుతుంది. గ్రామాల్లో నమోదైన సభ్యుడి వివరాలు కూడా ఏఐసీసీ లాగిన్ లోకి వెళ్తాయి. డిజిటల్ మెంబర్ షిప్ తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. సభ్యత్వ నమోదులో కీలకంగా పనిచేసిన నేతలకు పార్టీలో మంచి గుర్తింపు వుంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

సభ్యత్వ నమోదుకు కొన్ని కండిషన్లు పెట్టింది పీసీసీ. కాంగ్రెస్ డిజిటల్ మెంబర్ షిప్ తీసుకోవాలంటే.. మద్యానికి దూరంగా వుండాలి. అవినీతి అక్రమాలకు పాల్పడరాదు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.