
కార్మికుల పోరాటానికి దేశవ్యాప్త మద్దతు
రంగంలోకి నేషనల్ ట్రేడ్ యూనియన్ల లీడర్లు
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సంఘీభావ ర్యాలీలు
కేరళ, ఏపీలో పోరాట నిధిని సేకరిస్తున్న సంఘాలు
జాతీయ స్థాయిలో కార్యాచరణపై చర్చలు
ఆర్టీసీ సమ్మెపై దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ నజర్ పెట్టాయి. రాష్ట్ర సర్కార్మొండిగా వ్యవహరిస్తుండటం.. సీఎం కేసీఆర్ కామెంట్ల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్.. ఇలా అన్ని కార్మిక సంఘాల జాతీయ కమిటీలు సమ్మె జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాయని తెలిసింది. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు పద్మనాభన్, దివాకరన్ హైదరాబాద్ వచ్చి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టే విషయంపై జాతీయ సంఘాలు చర్చిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే కార్మిక, ప్రజా సంఘాల సపోర్ట్
టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మెపై సర్కారు మొండి వైఖరి.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కార్మికుల్లో పట్టుదలను పెంచాయి. ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించినా, రెండు నెలల నుంచి జీతాలివ్వకున్నా దాదాపు 48 వేల మంది కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీలోని యూనియన్లన్నీ సమ్మెలో పాల్గొంటుండగా, స్టేట్‌లోని అన్ని కార్మిక, ప్రజా సంఘాలూ వారికి అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె తీరుపై దృష్టి పెట్టాయి.
సమ్మెకు ఇతర రాష్ట్రాల్లోనూ మద్దతు
టీఎస్ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతుగా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో సంఘీభావ ర్యాలీలు జరిగాయి. ఏపీతోపాటు కేరళ, తమిళనాడు, హర్యానా, కర్నాటక, పంజాబ్, బెంగాల్, ఢిల్లీ, త్రిపుర రాష్ట్రాల్లో కార్మికులు నిరసనలు చేపట్టారు. ఏపీ, కేరళలో ఆర్టీసీ కార్మికుల కోసం సాలిడారిటీ ఫండ్‌ను కూడా సేకరిస్తున్నారు. ఈ సమ్మె విఫలమైతే, కార్మిక పోరాటాలకు విలువ లేకుండా పోతుందనే భావన అన్ని సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో జాతీయ స్థాయిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్యచరణ ప్రకటించాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ భావిస్తోంది. ఢిల్లీలో జరిగిన సీఐటీయూ ఆలిండియా ఆఫీస్ బేరర్స్ కమిటీ సమావేశం ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లోనూ సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గురువారం నుంచి ముంబైలో జరిగే ఏఐటీయూసీ జాతీయ కమిటీ సమావేశాల్లోనూ పోరాట కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశముంది.
ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే..
ఆర్టీసీ కార్మికులు సంస్థను రక్షించుకోవాలని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త మోటర్ వెహికల్ యాక్ట్‌ను చూపిస్తూ, ప్రైవేటీకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్మికుల పోరాటానికి, చాలా రాష్ట్రాలు సంఘీభావం తెలిపాయి. ఢిల్లీలో జరిగిన సీఐటీయూ ఆలిండియా కమిటీ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.
– ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సర్కారు పట్టుదలకు పోతోంది
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం పట్టుదలకు పోతోంది. కార్మికుల పోరాట పటిమను చూసి, కార్మిక సంఘాల జాతీయ కమిటీలూ అభినందనలు చెప్తున్నాయి. నేటి నుంచి ముంబైలో జరిగే ఏఐటీయూసీ ఆలిండియా కమిటీ సమావేశాల్లో ఆర్టీసీ సమ్మెపై చర్చించి, పోరాట రూపాన్ని ప్రకటిస్తాం. సర్కారు ఎంత భయపెట్టినా కార్మికులు వెనక్కి తగ్గడం లేదనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా సర్కారు చర్చలు జరిపి, సమ్మె విరమింపజేయాలి.
– బాల్‌రాజు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు