కిడ్నాప్ చేసి.. ట్రాఫిక్ జామ్ లో దొరికిపోయాడు

కిడ్నాప్ చేసి.. ట్రాఫిక్ జామ్ లో దొరికిపోయాడు

ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సరైన సమయంలో గమ్యానికి చేరుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అయితే ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ కిడ్నాప్ కేస్ సుఖాంతమైన ఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో జరిగింది.

ఉత్తమ్ నగర్ లో ఓ కిడ్నాప్ గ్యాంగ్.. రిజ్వాల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ తన పని ముగించుకొని కారులో ఇంటికి వెళుతున్న  రిజ్వాల్ ను నలుగురు వ్యక్తులు ఆటోలో ఫాలో చేసి అతన్ని అడ్డుకున్నారు.  కారు నుంచి రిజ్వాల్ ను బలవంతంగా కిందకు దింపి అతని వద్ద నుంచి కారు కీ లాక్కొని, అదే కారులో బంధించి ద్వారక వైపు వెళ్లారు.

అయితే తన సోదరుడు ఇంటికి రాకపోవడంతో రిజ్వాల్ తమ్ముడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిజ్వాల్ గురించి, అతని కారు వివరాలు, గుర్తులు గురించి పోలీసులకు తెలిపాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ వివరాల ఆధారంగా అతను ఇంటికి వచ్చే మార్గంలో నిఘా పెట్టారు. నంబరు ఆధారంగా ఉత్తమ్ నగర్ సమీపంలో ఆ కారును గమనించిన పోలీసులు… దానిని  వెంబడించారు. అయితే కారు నజఫ్ గఢ్ వెళ్లే క్రమంలో హెవీ ట్రాఫిక్ ఉండడంతో అక్కడే ఆగిపోయింది. తమను పోలీసులు వెంబడిస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన ఆ ముఠా  కారు నుంచి దిగి పారిపోయేందుకు యత్నించింది.  అందులో ఒకరిని పోలీసులు పట్టుకొని, అరెస్ట్ చేశారు. రిజ్వాన్ ని కాపాడారు. అరెస్టయిన వ్యక్తి ఉత్తమ్ నగర్ కి చెందిన క్రిమినల్ రవిగా పోలీసులు గుర్తించారు.

మొత్తానికి ట్రాఫిక్ జామ్ కారణంగా రిజ్వాన్ ప్రమాదం నుంచి బయటపడడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.