
మియాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల కల్యాణ్, జ్యోతి దంపతులు ఉపాధి కోసం సిటీకి వచ్చి మియాపూర్లోని స్టాలిన్ నగర్ లో ఉంటున్నారు. వీరి రెండున్నర ఏండ్ల కొడుకు ప్రణీత్ కుమార్ ఈ నెల16న ఇంటిముందు ఆడుకుంటూ నీటి సంపులో పడ్డాడు.
దీంతో బాలుడిని కుటుంబసభ్యులు బయటకు తీసి, దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.