హైదరాబాద్: తెలంగాణలో సోమవారం ఉదయం వరుస రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. నల్గొండ జిల్లా అద్దంకి బైపాస్ పానగల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పంచర్ అయి ఆగి ఉన్న లారీని (టీఎస్ 07 జీజే 8693) కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న సందీప్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలై స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
నరసరావుపేట నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నల్గొండ టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సందీప్ మృతిపై కుటుంబ సభ్యులకు నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు సమాచారం అందించారు.
ఇలానే మరో ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ దగ్గర అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మటన్ ఆర్డర్కు పోతుండగా ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తెలపాటి సైదులు అనే వ్యక్తి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ముగ్గురూ.. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

