రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(జూన్ 3) రాష్ట్రంలో సంతాప దినంగా పాటించనుంది. ఈ మేరకు ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా కాసేపట్లో సీఎం పట్నాయక్ కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరీశీలించనున్నారు.
జూన్ 2 రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది చనిపోయారని.. 900 మందికి పైగా గాయాలయ్యాయని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రైల్వే అధికారులు ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరో వైపు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సంఘటనా స్థలానికి చేరుకోగా ఆర్మీ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.. ఒక్కసారిగా రైళ్లు ఢీ కొనడంతో మృతదేహాలు రైళ్ల కింద చిక్కుకున్నాయి.
ప్రమాదంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో వైపు ఈ రైలు ప్రమాద ఘటనపై అత్యుతన్నత స్థాయి విచారణకు ఆదేశించామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి మూల కారణమేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు.
ఒడిశాలో ఈ ఘోర రైల్వే ప్రమాదం జరిగిన నేపథ్యంలో గోవా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కొంకణ్ రైల్వే అధికారులు తెలిపారు.

