- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
- కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్ విచారణ ఆగస్టు 26కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు అశోక్‌నగర్‌లోని ఉదయ్‌కృష్ణారెడ్డి అద్దెకు ఉండే రూమ్‌లో సోదాలు నిర్వహించారు.
అనంతరం అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏ)లో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారినిపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన నాటి నుంచి ఉదయ్‌కృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఉదయ్‌కృష్ణారెడ్డిని మంగళవారం మిర్యాలగూడలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌తరలించారు. విచారణ అనంతరం బుధవారం మధ్యాహ్నం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కాగా..తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఉదయ్‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు కూడా వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసింది.
