ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు పోర్టల్ కష్టాలు!..రిజిస్ట్రేషన్ ఆపేసిన కేంద్రం

ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు పోర్టల్ కష్టాలు!..రిజిస్ట్రేషన్ ఆపేసిన కేంద్రం
  •     దేశ వ్యాప్తంగా గైడ్ లైన్స్ ఖరారులో నిమగ్నం
  •     50 వేల మంది ఉంటే 3 వేల మందే రిజిస్ట్రేషన్

హైదరాబాద్, వెలుగు: నలుగురిలో తలెత్తుకుని బతకాలని, నాలుగు రాళ్లు సంపాదించుకుని గౌరవంగా జీవించాలని కలలు కంటున్న ట్రాన్స్‌‌‌‌జెండర్లకు కేంద్రం బ్రేక్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమ కోసం ప్రత్యేకంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న వేళ, అదృష్టం తలుపు తట్టినా అందుకోలేని దయనీయ స్థితిలో వేలాది మంది కొట్టుమిట్టాడుతున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘ట్రాన్స్‌‌‌‌జెండర్ గుర్తింపు కార్డు’ తప్పనిసరి అని నిబంధన పెట్టారు. అయితే ఈ గుర్తింపు కార్డు కోసం రిజిస్ర్టేషన్ చేసుకుందామనుకున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం బ్రేక్ వేసింది. ‘నేషనల్ ట్రాన్స్‌‌‌‌జెండర్ యాక్ట్  2026 ’ తీసుకొచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్రం రెడీ చేస్తోంది. 

ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ల రిజిస్ర్టేషన్ చేసుకునే పోర్టల్ ను తాత్కాలికంగా ఆపేసింది. రాష్ర్టంలో సుమారు 50 వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉండగా ఇందులో కేంద్ర పోర్టల్ లో రిజిస్ర్టేషన్ చేసుకున్న వారు 3 వేల మంది మాత్రమే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఐడీ కార్డు ఉన్న వారికే ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తోంది. కేంద్ర పోర్టల్ లో రిజిస్ర్టేషన్ చేసుకున్న ట్రాన్స్ జెండర్లకు రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. వీరిలో హైదరాబాద్ మెట్రో రైల్ లో 20, హైడ్రా లో 16, ట్రాఫిక్ లో 39 మందికి ఉద్యోగాలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో నమోదు అయిన ట్రాన్స్ జెండర్లనే రాష్ర్ట ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో పోర్టల్ లో రిజిస్ర్టేషన్ చేసుకుందామనుకున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం చెక్ పెట్టింది. కొత్త గైడ్ లైన్స్ ఖరారు అయేంత వరకు పోర్టల్ లో రిజిస్ర్టేషన్లకు అవకాశం లేదని రాష్ర్ట అధికారులు చెబుతున్నారు. గైడ్ లైన్స్ ఆలస్యంతో రాష్ర్టంలో ఉన్న వేలాది మంది అర్హులైన ట్రాన్స్‌‌‌‌జెండర్లు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. 

ఆశలు రేపిన ప్రభుత్వ కొలువులు

భిక్షాటన, వివక్షలకే పరిమితం కాకుండా ట్రాన్స్‌‌‌‌జెండర్లు సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగాలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ విభాగంలో వీరిని ప్రత్యేక అసిస్టెంట్లుగా నియమించింది. ఆ వెనువెంటనే హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లలో సెక్యూరిటీ గార్డులుగా కొలువులు కల్పించగా చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తెచ్చిన ‘హైడ్రా’ విభాగంలోని ప్రత్యేక బృందాల్లోనూ వీరికి స్థానం కల్పించారు. రాష్ట్రంలో ట్రాన్స్‌‌‌‌జెండర్లు  గుర్తింపు కార్డులు ఉన్నవారి సంఖ్య మాత్రం వేళ్లమీద లెక్కపెట్టేలా ఉంది. 

గతంలో నిర్వహించిన సమగ్రకుటుంబ సర్వేతో పాటు కమ్యూనిటీ అసోసియేషన్ల లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 50 వేల మంది వరకు ట్రాన్స్‌‌‌‌జెండర్లు జీవిస్తున్నారు. కానీ కేంద్ర నేషనల్ పోర్టల్  రికార్డులను పరిశీలిస్తే, రాష్ట్రం నుంచి ఇప్పటివరకు అధికారికంగా కార్డులు పొందిన వారి సంఖ్య 3 వేల లోపే ఉంది. అంటే రాష్ట్రంలోని దాదాపు 90 శాతానికి పైగా అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేవు. కార్డులు ఉన్న ఆ 3 వేల మంది పరిధిలోనే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ సాగుతుండటంతో, ఏ ఆధారం లేని మిగిలిన ట్రాన్స్‌‌‌‌జెండర్లకు అన్యాయం జరుగుతోంది. 

ఉపాధి అవకాశాలు
రాష్ర్టంలో ఉన్న ట్రాన్స్ జెండర్ల ఉపాధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల 16 మంది ట్రాన్స్ జెండర్లకు డ్రోన్ ఫైలెట్ విషయమై శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైన వారికి  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సర్టిఫికేట్లు అందచేశారు. వీటితో పాటు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్, ఉపాధి అవకాశాలకు సంబంధించిన కోర్సులపై సైతం ట్రైనింగ్ , కార్ డ్రైవింగ్, క్యాటరింగ్, ఇస్తారాకులు కుట్టడం వంటి ఉపాధి అవాకశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరి కోసం అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో మైత్రీ క్లీనిక్ లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డాక్టర్లను నియమించారు. వారంలో ఒక రోజు ఈ క్లీనిక్ లు పనిచేస్తున్నాయి.