
హైదరాబాద్, వెలుగు: నేరం రుజువయ్యే వరకు నిందితుడు ప్రయాణం చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. కేసులున్నాయన్న కారణంతో నిందితుడు ప్రయాణం చేయడాన్ని అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తనపై కేసులు ఉన్నాయని చెప్పి లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడాన్ని కొణతం దిలీప్ రెడ్డి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను సింగిల్ జడ్జి వాయిదా వేశారు. దీంతో ఆయన అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జె. శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ తండ్రి 15వ వర్ధంతి సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఈనెల 9 నుంచి జూన్ 6 వరకు అమెరికా వెళాల్సి ఉందని దిలీప్ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదిస్తూ పిటిషనర్ పై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.
లుకౌట్ నోటీసు రద్దు అన్నది క్రిమినల్ కేసు వ్యవహారం కాబట్టి అప్పీల్ పిటిషన్ లో జోక్యం చేసుకోరాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు కొట్టివేయాలని పిటిషనర్ కోరడం లేదని, ప్రయాణానికి సంబంధించి తన హక్కులపై మాత్రమే కోర్టును ఆశ్రయించారని గుర్తుచేసింది. నేరం రుజువయ్యేదాకా నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయరాదని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రస్తావించింది.
షరతులతో దిలీప్ రెడ్డి ప్రయాణానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది.