రెవెన్యూ శాఖను రద్దు చేస్తే ఉద్యమమే: ట్రెసా

రెవెన్యూ శాఖను రద్దు చేస్తే ఉద్యమమే: ట్రెసా
  • ఎంపీ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు
  • త్వరలో రాష్ట్ర స్థాయి రెవెన్యూ జేఏసీ ఏర్పాటు
  • ట్రెసా రాష్ట్ర కార్యవర్గ  సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో కీలకమార్పులు తెస్తామని  సీఎం కేసీఆర్ చెప్పడం..శాఖను రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా)రాష్ట్ర కార్యవర్గం సోమవారం  అత్యవసరంగా సమావేశమైంది. శాఖను కాపాడుకునేందు కు ఉద్యమానికి సిద్ధమవ్వాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. రాష్ట్ర కమిటీ సభ్యులు, 27 జిల్లాల ప్రతినిధులు హాజరై ముఖాముఖి అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వ తీరును కొందరు జిల్లాల నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. రెవెన్యూ పాలన వ్యవస్థను చక్కదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ‘నేడు రెవెన్యూ శాఖ రద్దు చేస్తామంటున్నారు. ఎన్నికల తర్వాత మరిన్ని ప్రభుత్వ శాఖలూ ఉనికి కోల్పోయే పరిస్థితి. అందుకు రాష్ట్రంలోని అన్నిఉద్యోగ సంఘాలను సంప్రదిం చి సరైన సమయంలోనిర్ణయం తీసుకోవాల్సి న అవసరం ఉంది’ అని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖకు పెద్దదిక్కుగా ఉండే చీఫ్‌ కమిషనర్‌‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ ఏ)గా రేమండ్‌ పీటర్‌‌ తర్వాత దాదాపు మూడేండ్లు ఎవరినీ పూర్తిస్థాయిలో నియమించకపోవడం రెవెన్యూ శాఖ రద్దు యోచనలో భాగమేనని రాష్ట్ర కమిటీ సభ్యుడొకరు పేర్కొన్నట్లు తెలిసిం ది. వాడివేడిగా జరిగిన భేటీలో లోక్‌ సభ ఎన్ని కల షెడ్యూల్‌ , ఎన్నికల విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఉన్నందున తీవ్రమైన నిర్ణయాలకు పోకుండా దశలవారీగా కార్యాచరణ ఉండాలని నిర్ణయించారు. ఎంపీ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలనుకుంటున్నారు. సమావేశంలో 14 తీర్మానాలను ఆమోదించారు.బుధవారం మంచిర్యాలలో సమావేశం కానున్నారు.

జేఏసీగా ముందుకు: ట్రెసా

భూ రికార్డుల ప్రక్షాళన వంద శాతం పూర్తికాకపోవ-డానికి ప్రస్తుత ధరణి సాఫ్ట్‌‌వేర్‌‌ సమస్యలే కారణమని సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌‌రెడ్డి, ఎం.నారాయణరెడ్డి అన్నారు. వెబ్‌ సైట్‌ రూపకల్పనలో తలెత్తిన సమస్యలు, సాఫ్ట్‌‌వేర్‌‌ లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా యావత్తు రెవెన్యూ వ్యవస్థను తప్పుపట్టడం అన్యాయమని వారు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, వీఆర్‌‌ఏలు, వీఆర్వోలు, అంటెండర్ల నుంచి తహశీల్దార్‌‌ వరకు ఉన్న ఉద్యోగ సంఘాలన్నింటికి కలిపి త్వరలో రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేస్తామని రవీందర్‌‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలవారీగా జేఏసీలను ఏర్పాటు చేస్తామని, అవసరాన్ని బట్టిఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కమిటీలు రూ-పొందిస్తామన్నారు.

రద్దు చేస్తే అగ్గి రాజేస్తం : గోల్కొండ సతీష్‌

రెవెన్యూ శాఖ ఉనికిని దెబ్బతీసే విధంగా రద్దు యోచన చేస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తమని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రసాధనలో కీలక భూమిక పోషించిన రెవెన్యూ ఉద్యోగులను ప్రశంసించిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతించి సహకరిస్తామని తెలిపారు .