8 ఏండ్లలో ఒక్కసారే టీఆర్టీ.. రెండుసార్లు టెట్

8 ఏండ్లలో ఒక్కసారే టీఆర్టీ.. రెండుసార్లు టెట్
  • టీచర్ పోస్టుల భర్తీ పట్టని సర్కారు
  • 2018లో డీఎస్సీ ఉంటుందన్న సర్కారు పెద్దలు 
  • టీఆర్టీ, టెట్ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు 
  • సర్కారు లెక్కల ప్రకారమే 13 వేల టీచర్​పోస్టులు ఖాళీ

జులై 23న టెట్ నిర్వహిస్తున్నం. టెట్‌‌ తర్వాత సర్కారు స్కూళ్లలోని 8,792 టీచర్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ ఇస్తున్నం. ఇవి 2016 సెప్టెంబర్‌‌ వరకున్న ఖాళీలే. తర్వాత మరో 5 వేల వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ పోస్టులకు వచ్చే ఏడాది నోటిఫికేషన్‌‌ ఇస్తం.
- 2017 జూన్ 7న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 

హైదరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను రాష్ట్ర సర్కారు భర్తీ చేయట్లేదు. కనీసం ప్రైవేటు బడుల్లోనైనా టీచర్ అవుదామనుకుంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) కూడా పెట్టట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో రెండేండ్లకోసారైనా డీఎస్సీ పెట్టేవాళ్లు. కానీ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గత 8 ఏండ్లలో ఒకే ఒక టీఆర్టీ (డీఎస్సీ) నిర్వహించారు.  రాష్ట్రంలోని 26,050 సర్కారు స్కూళ్లలో 1.07 లక్షల మంది గవర్నమెంట్ టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్లతో పాటు రెండేండ్ల కింది వరకు 12 వేల మంది విద్యా వలంటీర్లు పని చేసేవారు. వాళ్లను రెండేండ్ల నుంచి రెన్యువల్ చేయలేదు. 2017లో టీఆర్టీ ద్వారా 8,792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా వీటిలో వెయ్యి పోస్టుల వరకూ వివిధ కారణాలతో భర్తీ కాలేదు. ఈ పోస్టులన్నీ 2016 నాటి ఖాళీలేనని.. 2017 నాటికి 5 వేల టీచర్ ఖాళీలున్నాయని అప్పట్లో నాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మళ్లీ సర్కారు బడుల్లో టీచర్ పోస్టులను నింపలేదు. అధికారికంగానే 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్రానికి ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కానీ సుమారు18వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయని టీచర్ యూనియన్ల నేతలు చెప్తున్నారు. మరోపక్క సర్కారేమో టీచర్ల రేషనలైజేషన్ చేస్తే ఒక్క టీచర్ పోస్టు కూడా అవసరం ఉండదని చెప్పుకొస్తుంది. కానీ ఇటీవల జిల్లాల్లో టీచర్లను అడ్జెస్ట్ పేరుతో రేషనలైజేషన్ చేసినా ఇంకా వేల స్కూళ్లలో టీచర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ వందల స్కూళ్లలో, హైస్కూళ్లలో కొన్ని సబ్జెక్టులు స్టార్టే కాలేదు. అయినా సర్కారు మాత్రం పట్టించుకోవట్లేదు.

టెట్ ను మరిచిపోయిర్రు
విద్యా హక్కు చట్టం ప్రకారం బడుల్లో చదువు చెప్పాలంటే టెట్ క్వాలిఫై కావాలి. 6 నెలలకోసారి నిర్వహించాల్సిన ఈ టెట్ ను రాష్ట్రంలో నాలుగేండ్లు దాటినా పెట్టట్లేదు. ఏడాదికోసారి నిర్వహిస్తామని 2016లో ప్రభుత్వం ప్రకటించినా కనీసం అదీ అమలు చేయట్లేదు. తెలంగాణ వచ్చాక 2016 మే 22న తొలిసారి టెట్ నిర్వహించగా 2017 జులై 23న రెండోసారి టెట్‌‌ పెట్టారు. ఆ తర్వాత టెట్​ఆలోచనే మరిచిపోయారు. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫైల్​ను సర్కారుకు పంపినా  ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గతంలో టెట్ వ్యాలిడిటీ ఏడేండ్లు ఉండేది. ఈ లెక్కన ఉమ్మడి ఏపీలో 2011,2012 జనవరి, 2012 జూన్‌‌, 2014 మార్చి టెట్‌‌ల కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం టెట్ వ్యాలిడిటీ లైఫ్ టైమ్ చేయడంతో వారికి  రెన్యూవల్ సమస్య తప్పింది. 

క్వాలిఫై కానోళ్లు, కొత్తోళ్లకే లేదు
రాష్ట్రంలో 2017లో నిర్వహించిన టెట్‌‌లో పేపర్‌‌1ను 98,848 మంది రాస్తే 56,708(57.37%) మంది, పేపర్‌‌2ను 2,30,932 మంది రాస్తే 45,045 (19.51%) మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించని వాళ్లు 2,28,027 మంది ఉన్నారు. వీళ్లతోపాటు గత నాలుగేండ్లలో మరో లక్ష మందికి పైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వాళ్లుంటారు. టెట్ ​నిర్వహించకపోవడంతో వీళ్లంతా ప్రైవేటు స్కూళ్లలో చదువు చెప్పేందుకు చాన్స్ ​లేకుండా పోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా టెట్​తో పాటు టీఆర్టీ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

టెట్, టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నం
రాష్ట్రంలో 5 లక్షల మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు.. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 6 నెలలకోసారి టెట్, రెండేండ్లకోసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. సొంతరాష్ట్రంలో 8 ఏండ్లలో ఒక్కసారే టీఆర్టీ పెట్టారు. నిరుద్యోగ అభ్యర్థులను ప్రభుత్వం మభ్యపెడుతోంది. 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయట్లేదు. టీఆర్టీ, టెట్ నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలి.
- రాంమోహన్​రెడ్డి, డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు