న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రైవేటు పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈ పర్యటనలో ఆమె భర్త మైఖేల్ బౌలోస్, వారిస్నేహితుల బృందం కూడా పాల్గొంది. అందుకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకున్నారు.
అక్షరధామ్ ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని, అక్కడి శిల్పకళ, సంస్కృతి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కితాబిచ్చారు. టిఫానీ ట్రంప్ పర్యటనను అక్షరధామ్ ఆలయ నిర్వాహకులు కూడా ధ్రువీకరించారు. ఆమెకు ఘన స్వాగతం పలికి, భారతీయ సంప్రదాయాలను వివరించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ దంపతులకు సాదర స్వాగతం పలికారు. ‘‘భారత్‌కు స్వాగతం!’’ అంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మాజీ భార్య మార్లా మాపుల్స్ కుమార్తెనే టిఫానీ ట్రంప్. ఆమె 2020లో జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్ నుంచి లా డిగ్రీని పొందారు. 2022, నవంబర్12న మైఖేల్ బౌలోస్‌ను వివాహం చేసుకున్నారు.
