వాషింగ్టన్ డీసీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోమారు అభిశంసనకు గురయ్యారు. వారం రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్ మరోమారు అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అమెరికా హిస్టరీలో రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి పాలయ్యారు. ఈ తీర్మానంపై సెనేట్‌లో చర్చ జరగనుంది. ఈ చర్చలో ఆమోదం పొందితే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోనున్నారు. సభలో 232 ఓట్లు పోల్ కాగా.. 197 ఓట్లు డెమొక్రాట్లకు మద్దతుగా వచ్చాయి. అభిశంసన తీర్మానానికి ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్‌కు చెందిన 10 మంది సభ్యులు మద్దతుగా నిలవడం గమనార్హం.
