బైడెన్ గెలుపును కన్ఫామ్ చేసేందుకు కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా విధ్వంసం
క్యాపిటల్‌ను చుట్టుముట్టిన వేలాది మంది.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఫైరింగ్.. ఒకరు మృతి
గొడవల్లో చనిపోయిన మరో ముగ్గురు.. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా టెన్షన్
బైడెన్ గెలిచినట్లు సర్టిఫై చేసిన కాంగ్రెస్.. ఓటమిని అంగీకరించిన ట్రంప్
క్యాపిటల్ బిల్డింగ్‌లోకి దూసుకెళ్లిన ట్రంప్ సపోర్టర్లు
బైడెన్ గెలుపును కన్ఫార్మ్ చేసేందుకు కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా ఘటన
అది వాషింగ్టన్‌లోని క్యాపిటల్ బిల్డింగ్..
తన నిర్ణయాలతో ప్రపంచాన్నే ప్రభావితం చేసే అత్యున్నత చట్టసభ..
బిల్డింగ్‌కు చుట్టుపక్కల చీమచిటుక్కుమన్నా తెలుసుకునే టెక్నాలజీ..
అడుగడుగునా టైట్ సెక్యూరిటీ..
అట్లాంటి అమెరికా పార్లమెంటు రణరంగమైంది! వేలమంది ట్రంప్ సపోర్టర్లు బిల్డింగ్‌పైకి దండెత్తారు. తాళ్లు, నిచ్చెనలు వేసుకుని గోడలెక్కారు. కిటికీల అద్దాలు, మెయిన్ డోర్లను పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. కత్తులు, తుపాకులతో వీరంగం చేశారు. దొరికిన పోలీసులను పట్టుకుని చితకబాదారు. సెనేట్, హౌస్‌ఆఫ్ రెప్రజెంటేటివ్స్లోకి దూసుకెళ్లి అరాచకం సృష్టించారు. బైడెన్ గెలుపును కన్ఫామ్ చేసేందుకు సమావేశమైన చట్టసభ్యులను బెంబేలెత్తించారు. ఏం జరుగుతున్నదో తెలియక సెనేటర్లు బిక్కుబిక్కుమంటూ సీట్ల కింద దాక్కున్నారు. చివరికి పోలీసుల సాయంతో అండర్‌గ్రౌండ్ టన్నెల్ ద్వారా బయటపడ్డారు. నాలుగు గంటలపాటు అమెరికా పార్లమెంటులో జరిగిన ఈ బీభత్సాన్ని ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసింది.
వాషింగ్టన్/న్యూయార్క్:
అమెరికా రాజధాని వాషింగ్టన్ రణరంగమైంది. ఆందోళనలతో యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ అట్టుడికింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిరసనల పేరుతో హింసకు దిగారు. బారికేడ్లు దాటుకుని వచ్చి క్యాపిటల్ బిల్డింగ్వైపు దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ప్రొటెస్టర్లు మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపై దాడులు చేస్తూ.. లోనికి చొచ్చుకెళ్లారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఏకంగా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, సెనేట్‌లోకి వెళ్లారు. అయితే అప్పటికే చట్టసభ్యులంతా అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాలుగు గంటలపాటు శ్రమించిన భద్రతా సిబ్బంది.. అందరినీ బయటికి పంపేశారు. క్యాపిటల్ బిల్డింగ్‌కు ఆక్రమణ నుంచి విముక్తి కల్పించారు.
లెక్కింపు మొదలుకాగానే..
గతేడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచారు. బైడెన్‌ను తర్వాతి ప్రెసిడెంట్‌గా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో జో బైడెన్ గెలుపును కన్పార్మ్ చేసేందుకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్ బుధవారం (లోకల్ టైం ప్రకారం) సమావేశమైంది. కాంగ్రెస్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి, కన్ఫార్మ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ ప్రాసెస్‌ను అడ్డుకునేందుకు అప్పటికే వేలాది మంది ట్రంప్ సపోర్టర్లు క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నారు. ట్రంప్ ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకుని.. ముందుగా బయటే నిరసనలు తెలిపారు. అయితే ఉన్నట్టుండి బిల్డింగ్‌లోకి దూసుకురావడం మొదలుపెట్టారు. బారికేడ్లను దాటుకుని, క్యాపిటల్ బిల్డింగ్ తూర్పు గేటు దాకా వచ్చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా సెక్యూరిటీని దాటుకుని ఆందోళనకారులు క్యాపిటల్ బిల్డింగ్‌లోకి ఎంటర్ అయ్యారు. తాళ్లు కట్టుకుని, నిచ్చెనలు వేసుకుని మరీ గోడలు ఎక్కారు.
నాలుగు గంటలపాటు..
హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, సెనేట్‌ను కలిపే ‘రొటుండా’ మెట్ల దగ్గరికి ఆందోళనకారులు చేరుకున్నారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నా.. గోడలు ఎక్కుతూ లోనికి ప్రవేశించారు. రొటుండాలో పరిస్థితి చేజారి పోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు డోర్ల అద్దాలను పగలగొట్టారు. పోలీసులు కాల్పులు జరపగా.. ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురు గొడవల్లో చనిపోయారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ ఆందోళనలు కొనసాగాయి. సాయంత్రం 6 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. సెక్యూరిటీ ఫోర్సెస్.. క్యాపిటల్ బిల్డింగ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే నిరసనకారులు మాత్రం క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరి నుంచి వెళ్లలేదు. 52 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
మొత్తం లాక్డౌన్
అంతకుముందు ఆందోళనకారులు దూసుకువస్తుండటంతో అలర్ట్ అయిన అధికారులు హౌస్, సెనేట్, మొత్తం క్యాపిటల్ బిల్డింగ్‌ను లాక్డౌన్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని భారీగా మోహరించారు. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ చాంబర్‌లోనికి ప్రొటెస్టర్లు వస్తున్నారంటూ సభ్యులకు హెచ్చరిక జారీ చేశారు. సెనేట్‌లోనూ సభ్యులను అప్రమత్తం చేశారు. వెంటనే సెనేట్ నిర్వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర చట్ట సభ్యులను సురక్షిత దారుల ద్వారా అక్కడి నుంచి తరలించారు. బయట కాల్పులు జరగడంతో చట్ట సభ్యులు, సిబ్బంది సీట్లకింద దాక్కోవడం వీడియోల్లో కనిపించింది. తర్వాత ఒక్కొక్కరుగా అండర్ గ్రౌండ్ టన్నెల్‌కు మెట్ల ద్వారా వెళ్లారని అధికారులు చెప్పారు. ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన హింసాత్మక ఆక్రమణకు అడ్డుకట్ట వేశామని, ‘క్యాపిటల్ సురక్షితం’గా ఉందని అధికారులు తెలిపారు. జనాన్ని చెదరగొట్టడానికి భారీగా సాయుధ పోలీసు సిబ్బందిని నియమించారు.
పోలీసులపై పిడిగుద్దులు
క్యాపిటల్ బిల్డింగ్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్ తో నిరసనకారులు కొట్లాటకు దిగారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఒంటిపై షర్ట్ లేకుండా వచ్చిన ఓ వ్యక్తి.. బరిసె లాంటి ఆయుధం చేతబట్టుకుని అధికారులతో వాదించడం కనిపించింది. సెనేట్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్‌పై ఓ ఆందోళనకారుడు కూర్చున్నాడు. నాన్సీ పెలోసీ చైర్లో కూర్చుని, డెస్క్‌పై కాలు పెట్టి ఫొటోలకు ఫోజిచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. వీలైనంత వరకు వాళ్లతో గొడవకు దిగకుండా సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ప్రశాంతంగా క్యాపిటల్ హిల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు బయటికి వచ్చాయి.
వైట్‌హౌస్ ఉన్నతాధికారుల రాజీనామా
క్యాపిటల్‌పై దాడిని అడ్డుకోవడంలో ఫెయిల్ అయినందుకు బాధ్యత వహిస్తూ వైట్‌హౌస్ ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. యూఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మ్యాట్ పొట్టింగర్, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రిషామ్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
రెండు పైప్ బాంబులు స్వాధీనం
రెండు పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ బయట ఒకటి, రిపబ్లికన్ నేషనల్ కమిటీ బయట మరొకటి రికవర్ చేసినట్లు తెలిపారు.
ఇది దేశద్రోహం
అమెరికాలో ప్రజాస్వామ్యం దాడికి గురైంది. ఇది ప్రజా ప్రతినిధులపై దాడి. చట్టంపై జరిగిన దాడి. చట్టాన్ని ఉల్లంఘించిన కొంతమంది టెర్రరిస్టులను మనం చూస్తున్నాం. ఇది దేశద్రోహం. దీనికి వెంటనే ముగింపు పలకాలి. ప్రెసిడెంట్ మాటలు మంచిగా ఉంటే.. ఇన్ స్పిరేషన్ ను ఇస్తాయి. చెడుగా ఉంటే.. రెచ్చగొడతాయి. ఇది నిరసన కాదు.. తిరుగుబాటు. దేశానికే ఇది చీకటిరోజు. -జో బైడెన్, ప్రెసిడెంట్ ఎలెక్ట్
పోరాటాన్ని కొనసాగిస్తా
ఎన్నికల రిజల్ట్ ను ఇప్పటికీ ఒప్పుకోను. కానీ ఓటమిని మాత్రం అంగీకరిస్తున్నా. జనవరి 20న చట్టప్రకారం బైడెన్ కు అధికారం అప్పగిస్తా. ఓట్లను సక్రమంగా లెక్కించాలని ఎప్పటినుంచో కోరుతున్నా. అమెరికాను మళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు మా పోరాటం కొనసాగుతుంది. నేను రాజకీయాల్లోనే ఉంటా. -యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్
రెచ్చగొట్టి పంపిన ట్రంప్
సేవ్ అమెరికా పేరుతో వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌కు దగ్గర్లో సభ నిర్వహించిన డొనాల్డ్ ట్రంప్.. వేలాది మంది తన మద్దతు దారులను రెచ్చగొట్టారు. బైడెన్ కన్ఫర్మేషన్ను వ్యతిరేకిస్తూ క్యాపిటల్ బిల్డింగ్‌కు మార్చ్ చేయాలంటూ పిలుపునిచ్చారు. హింస చెలరేగడంతో తర్వాత శాంతి వచనాలు పలికారు. ‘‘చట్టానికి కట్టుబడి ఉండండి.. ఇండ్లకు తిరిగి వెళ్లిపోండి. మనం ఇలాంటి వాళ్ల చేతుల్లో కీలు బొమ్మల్లా ఉండలేం. మనకు శాంతి కావాలి.” అంటూ తన సపోర్టర్లకు చెప్పారు. అంతకుముందు క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి చేసిన వారంతా గొప్ప దేశ భక్తులని ట్వీట్ చేయడం దుమారం రేపింది. దీంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ట్రంప్ ఎకౌంట్లను బ్లాక్ చేశాయి.
నాన్సీ పెలోసీ ఆఫీసు డ్యామేజ్
హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆఫీసును నిరసనకారులు ధ్వంసం చేశారు. పెద్ద అద్దాన్ని ముక్కలు చేశారని, ఆమె కార్యాలయం తలుపుపై నుంచి నేమ్‌ప్లేట్‌ను తీసుకెళ్లారని పెలోసి సహాయకులు తెలిపారు. పెలోసీ డెస్క్‌పైన ఒక వ్యక్తి కాళ్లు పెట్టి కూర్చున్న ఫొటో కూడా బయటికి వచ్చింది. ప్రొటెస్టర్లు
టేబుల్స్‌ను విరగ్గొట్టారని, గోడల నుంచి ఫొటోలను తీసేశారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అల్లర్లు తగ్గాక రాత్రి తన ఆఫీసుకు వచ్చిన పెలోసీ.. అల్లర్లకు పాల్పడిన వాళ్లు తమ మిషన్‌లో విఫలమయ్యారని, తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ భేటీ అవుతుందని చెప్పారు. ‘‘ఈ రోజు సిగ్గుపడే చర్యలు జరిగినప్పటికీ.. మేం చేయాల్సింది చేస్తాం. అమెరికా ఏం తయారు చేసిందో.. ప్రపంచానికి చూపించే చరిత్రలో మేం భాగం అవుతాం. క్యాపిటల్‌కు కాంగ్రెస్ తిరిగి వచ్చింది. ఈ బాధ్యత రాత్రి దాకా కొనసాగుతుందని మాకు తెలుసు. ఎంత టైం అయినా సరే మేం ఇలానే ఉంటాం” అని పెలోసీ చెప్పారు.
200 ఏండ్లలో మొదటి సారి..
యూఎస్ క్యాపిటల్‌పై ఇలాంటి దాడి జరగడం 200 ఏండ్లలో ఇదే మొదటి సారి. క్యాపిటల్ నిర్మాణం 1800లో పూర్తయింది. 1812లో యుద్ధం జరిగినప్పుడు బ్రిటిషర్లు క్యాపిటల్‌లోకి చొరబడి నిప్పు పెట్టారు. దీంతో బిల్డింగ్ చాలా వరకు కాలిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆక్రమణకు ప్రయత్నించడం ఇప్పుడేనని హిస్టారియన్లు చెప్పారు.
15 రోజులు ఎమర్జెన్సీ
క్యాపిటల్ భవనంలో కాల్పులు జరిగిన నేపథ్యంలో వాషింగ్టన్‌లో మేయర్ మురియెల్ బౌజర్ కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా కొందరు ఆందోళనలకు దిగారు. దీంతో సిటీ అంతటా 15 రోజులు ఎమర్జెన్సీ విధిస్తూ మేయర్ ఆర్డర్లు ఇచ్చారు.
ట్రంప్‌పై మీడియా నిప్పులు..
క్యాపిటల్‌పై దాడికి కారణమైన ట్రంప్‌పై అమెరికా మీడియా నిప్పులు చెరిగింది. ట్రంప్ తన కామెంట్లతో క్యాపిటల్ పై హింసాత్మక దాడిని ప్రేరేపించారని, ఆయన ఆ పదవిలో ఉండటానికి అనర్హుడని, వెంటనే తొలగించాలని మండిపడింది. అభిశంసన చర్యల ద్వారా లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ద్వారా ఆయన్ను అకౌంటబుల్గా చేయాలని డిమాండ్ చేశాయి. ‘దాడికి ట్రంప్ కారణం’ అనే టైటిల్‌తో న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ రాసుకొచ్చింది.
‘వాషింగ్టన్‌లో 24 గంటల్లో తుఫాను వస్తది’ -ఇట్ల ట్వీట్ చేసి.. క్యాపిటల్ దగ్గర బులెట్‌కు బలైంది
లాస్‌ఏంజెలెస్: ‘మనల్ని ఏదీ ఆపలేదు. వాళ్లు ఎంతైనా ప్రయత్నించని.. ఇక్కడ తుఫాను ఉంది. 24 గంటల్లో వాషింగ్టన్ డీసీలో దిగుతుంది. చీకటి పోయి వెలుగు వస్తుంది’.. అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ కాల్పుల్లో మృతి చెందిన మహిళ తన ట్విట్టర్ అకౌంట్‌లో చివరగా రాసుకున్న మాటలివి. ఆమె పేరు ఆష్లీ బబ్టిట్(35) అని, దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఉంటోందని, అక్కడ భర్తతో కలిసి బిజినెస్ చేస్తోందని అమెరికా మీడియా వెల్లడించింది. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో ఆమె పని చేసిందని, ట్రంప్‌కు స్ట్రాంగ్ సపోర్టరని తెలిపింది. క్యాపిటల్ బిల్డింగ్‌లో ఆందోళనకా రులను అడ్డుకునే ప్రయత్నంలో కాల్పులు జరగ్గా బబ్బిట్ మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ గాయమైన కాసేపటికి ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. బబ్బిట్ ఎందుకు అలా చేయాలనుకుందో తమకు తెలియదని ఆమె అత్త మీడియాకు చెప్పారు.
హింస ఎన్నటికీ గెలవదు
క్యాపిటల్‌పై దాడిని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఖండించారు. హింస ఎన్నటికీ గెలవదన్నారు. సాయంత్రం మళ్లీ జాయింట్ సెషన్ మొదలయ్యాక పెన్స్ మాట్లాడారు. ‘‘ఈ రోజు మన క్యాపిటల్ ను కాపాడుకునేందుకు అడ్డుగా నిలబడి ఎందరో గాయపడ్డారు. ఈ చారిత్రాత్మక స్థలాన్ని కాపాడటానికి ప్రయత్నించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని చెప్పారు. ‘‘ఈ రోజు మన క్యాపిటల్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించిన వారు గెలవలేరు. ఎందుకంటే హింస ఎప్పటికీ గెలవదు. స్వేచ్ఛ గెలుస్తుంది. ఇది ఇప్పటికీ ప్రజల ఇల్లు” అని అన్నారు. అంతకుముందు పెన్స్ ట్వీట్‌లో.. ‘‘ప్రొటెస్టర్లు వెంటనే బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లిపోవాలి. మన క్యాపిటల్‌పై దాడిని సహించబోం. దీనితో సంబంధం ఉన్న అందరినీ చట్టం ప్రకారం శిక్షిస్తాం’’ అని స్పష్టం చేశారు.
మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ
నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు
పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం
