హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 71,452 మంది విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేసి, సీట్లను ఖరారు చేసుకున్నారు. మిగిలిన 22,972 సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాలో 94,424 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రెండో విడతలో 80,167 మందికి సీట్లు అలాట్ చేయగా, అందులో 71,452 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు.
మిగిలిన దాదాపు 23 వేల సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలు కానుంది. గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోని విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఆగస్టు 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెరిఫికేషన్ పూర్తయినవారు, కొత్తగా పూర్తి చేసుకున్న వారు కలిపి ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆగస్టు 5న లేదా అంతకంటే ముందే ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. ఇదే చివరి విడత కౌన్సెలింగ్ అని అడ్మిషన్ కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు. వివరాలకు https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
