గణపతుల ఎత్తుపై ఆంక్షల్లేవ్

గణపతుల ఎత్తుపై ఆంక్షల్లేవ్

హైదరాబాద్, వెలుగు: గణపతి విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పోలీసుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. అయితే నిర్వాహకులే ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో శనివారం సమావేశం నిర్వహించారు. చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తలసాని చెప్పారు. కరోనా రూల్స్ పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిపించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేసేలా హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, సఫిల్ గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన స్టాటిక్, మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేయాలని, 3 షిఫ్టుల్లో సిబ్బంది పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

లక్షా 60 వేల విగ్రహాల పంపిణీ.. 

పీసీబీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హెచ్​ఎండీఏ, జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లక్షా 60 వేల విగ్రహాలను అందజేస్తామన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం అన్ని పండుగలకు ఏర్పాట్లు చేస్తోందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, గణేశ్ ఉత్సవాల నిర్వాహకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.