బీసీ లోన్లు పత్తాలేవ్​..ఈ ఏడాది కూడా మొండి చెయ్యే!

బీసీ లోన్లు పత్తాలేవ్​..ఈ ఏడాది కూడా మొండి చెయ్యే!
  • మార్చిలోనే యాక్షన్ ప్లాన్‌‌ను సర్కారుకు పంపిన ఆఫీసర్లు
  • రూ. 1,400 కోట్లతో 1.6 లక్షల మందికి ఇవ్వాలని టార్గెట్‌‌
  • ఆరు నెలలైనా అప్రూవ్  చేయని రాష్ట్ర ప్రభుత్వం
  • బడ్జెట్‌‌లో మాత్రం రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు గొప్పలు
  • మూడేండ్లుగా లోన్లు ఇచ్చుడే లేదు.. ఏడేండ్లలో ఇచ్చింది రెండుసార్లే
  • అటు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక.. ఇటు ఉపాధికి లోన్లు రాక యువత తిప్పలు

హైదరాబాద్‌‌, వెలుగు: బీసీ నిరుద్యోగ యువతకు ఈ ఏడాది కూడా రాష్ట్ర సర్కారు మొండిచెయ్యే చూపిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఇచ్చే సబ్సిడీ లోన్లు పత్తాలేవు. లోన్ల కోసం అధికారులు యాక్షన్ ప్లాన్‌‌ రెడీ చేసి సర్కారుకు పంపించినా ఉలుకూ పలుకూ లేదు. ఆరు నెలల నుంచి దాన్ని పెండింగ్​లో పెడుతోంది. బడ్జెట్‌‌లో మాత్రం వెయ్యి కోట్లు కేటాయించినట్లు గొప్పలు  చెప్పుకుంటోంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి ఒక్కరికి కూడా ప్రభుత్వం బీసీ లోన్లు మంజూరు చేయలేదు. అధికారులు పంపిన యాక్షన్​ ప్లాన్​ను మూలకు పడేస్తూనే ఉంది. మొత్తంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఏడేండ్లలో రెండుసార్లు మాత్రమే బీసీ లోన్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ తీరుపై బీసీ నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. ఒక దిక్కు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక.. మరో దిక్కు కరోనాతో జాబ్స్‌‌ కోల్పోయి లక్షల మంది లోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. లోన్లు ఇస్తేనన్నా స్వయం ఉపాధి పొందొచ్చని భావిస్తుంటే సర్కారు మాత్రం స్పందించడం లేదు. 

ఈ సారి లక్షా 60 వేల మందికి ఇవ్వాలని టార్గెట్​ పెడితే..!

బీసీ లోన్లకు సంబంధించి ఆఫీసర్లు ఏటా యాక్షన్‌‌ ప్లాన్‌‌ రెడీ చేస్తుంటారు. ఎంత మంది కి లోన్లు ఇవ్వాలి..? ఎంత బడ్జెట్‌‌ అవసరం..? ఎప్పటిలోగా అందజేయాలి..? తదితర వివరాలు అందులో ఉంటాయి. దీన్ని సర్కార్‌‌కు పంపితే..  పరిశీలించి అప్రూవ్‌‌ చేస్తుంది. కానీ మూడేండ్లుగా అధికారులు యాక్షన్‌‌ ప్లాన్‌‌ పంపిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. ఎప్పటిలెక్కనే అధికారులు ఈ ఏడాది కూడా మార్చిలో యాక్షన్‌‌ ప్లాన్‌‌  రెడీ  చేశారు. రూ.1,400 కోట్లతో 1.6 లక్షల మందికి లోన్లివ్వాలని నిర్దేశించుకొని.. సర్కారుకు రిపోర్టు పంపారు. కానీ ఇప్పటికీ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌  అప్రూవ్‌‌‌‌  కాలేదు. 

బడ్జెట్​లో మాత్రం గొప్పలు

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌‌‌‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.  5,522 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌‌‌‌, ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌కు రూ. 500 కోట్ల చొప్పున మొత్తం రూ. వెయ్యి కోట్లు కేటాయింపులు జరిపారు. కానీ ఇప్పటికీ పథకాల అమలుకు సంబంధించి ఏ ఒక్క కార్పొరేషన్‌‌‌‌కు కూడా పైసా విడుదల చేయలేదు. 2017లో ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దానికి బడ్జెట్​లో  రూ. 2,500 కోట్లు కేటాయించగా.. రూ. 100 కోట్లు కూడా విడుదల చేయలేదు. ఏటా బడ్జెట్‌‌‌‌లో 500 కోట్ల పెడుతున్నట్లు చూపిస్తున్నా పైసలు మాత్రం రిలీజ్‌‌‌‌ చేయడంలేదు.  బీసీ కార్పొరేషన్‌‌‌‌  పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. ఏడేండ్లలో బీసీ కార్పొరేషన్​కు రూ. 230 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 

లక్షల మంది ఎదురుచూపులు

రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎప్పట్నుంచో ప్రిపేర్‌‌‌‌ అవుతున్నారు. రేపు మాపు అంటూ నోటిఫికేషన్లపై సర్కారు ఊరించడం తప్ప వేసింది లేదు. ఏడేండ్లలో పెద్ద నోటిఫికేషన్లు రాలేదు. ఇక కరోనా ఎఫెక్ట్​తో  అనేక మంది ప్రైవేట్​ ఉద్యోగాలు పోయాయి. కనీసం చేసుకోవడానికి ప్రైవేట్‌‌‌‌ జాబ్‌‌‌‌లు కూడా దొరకడంలేదు. సర్కారు లోన్లు ఇస్తే చిన్నపాటి బిజినెస్‌‌‌‌ పెట్టుకోవచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. నెలల తరబడి లోన్ల కోసం ఎదురుచూస్తున్నా సర్కారు స్పందించడం లేదు.    

ఎలక్షన్లు అయిపోంగనే అప్లికేషన్లు మూలకు

బీసీ లోన్లకు సంబంధించి రెండు కార్పొరేషన్లు, 11 ఫెడరేషన్లు ఉండగా.. తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీటిద్వారా రెండుసార్లు మాత్రమే లోన్లు ఇచ్చారు.  2015లో ఒకసారి, 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి ఇచ్చారు. 2018లో అప్లయ్​ చేసుకున్నవాళ్లలో రూ. లక్ష లోపు లోన్ అవసరం ఉన్న 50 వేల మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోగానే అప్లికేషన్లను పక్కన పడేశారు. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే 5.7 లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. 

ఫెడరేషన్లకు ఫండ్స్​ లేవ్​​.. పాలక మండళ్లు లేవ్​ 

బీసీల్లో వివిధ కులాల అభివృద్ధి కోసం 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో రజక, నాయీబ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర, వాల్మీకి (బోయ), కృష్ణ బలిజ (పూసల), భట్రాజు, కుమ్మరి, మేదర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లు ఉన్నాయి.  ఆయా ఫెడరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు, కులవృత్తులపై శిక్షణ, సబ్సిడీ కింద వివిధ మెషీన్లు అందజేయాలి. కానీ గత రెండు బడ్జెట్లలో ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదు. వీటికి 
పాలకమండళ్లను కూడా నియమించలేదు.

లోన్లు ఇయ్యకుంటే ఉద్యమిస్తం

బడ్జెట్‌‌‌‌లో బీసీలకు ఎప్పుడూ నిరాశే ఎదురువుతోంది. బడ్జెట్‌‌‌‌లో కేటాయిస్తున్నట్లు చూపిస్తున్నా ఖర్చు చేస్తలేరు. ఏడేండ్లలో బీసీ కార్పొరేషన్‌‌‌‌  ద్వారా మొత్తం రూ. 230 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తరా..? ఇది దారుణం. లోన్ల కోసం లక్షల మంది బీసీ యువత ఆశగా ఎదురుచూస్తున్నరు. వెంటనే లోన్లు ఇవ్వాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తం.
- ఆర్‌‌‌‌.కృష్ణయ్య, 
జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ప్రెసిడెంట్‌‌‌‌