సన్నాసులు, దద్దమ్మలంటే ఊరుకోం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 సన్నాసులు, దద్దమ్మలంటే ఊరుకోం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •  కారు షెడ్ నుంచి ఇక బయటికి రాదు
  •  కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
  •  నామా ఏ పార్టీ నుంచి మంత్రైతరు..?
  •  కేసీఆర్..సోయి ఉండే మాట్లాడుతున్నవా?
  •  65 లక్షల మందికి రైతు భరోసా వేశాం.. మిగతా వారికి వేస్తున్నం

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన భాష మార్చుకోవాలని, ఇకపై సీఎంను, మంత్రులను సన్నాసులు, దద్దమ్మలంటే ఊరుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. షెడ్డుకుపోయిన కారు ఇక బయటికి రాదని హెచ్చరించారు. ఇవాళ బోనకల్ లో కాంగ్రెస్ ఎంపీ  అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా జరిగిన ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని కేసీఆర్ చెబుతున్నారని, ఏ పార్టీ నుంచి మంత్రి అవుతరో చెప్పాలన్నారు. ఆయన సోయి ఉండే మాట్లాడుతున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవటం ఖాయమన్నారు.  ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ఒక్క నెల కూడా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో కాకి అరిచినట్టుగా రైతుబంధు ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారని, ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశామని, మిగిలిన వారికీ వేస్తున్నామని చెప్పారు. అబద్ధాల పునాదుల మీదే బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ మీద బురద చల్లడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.