జిల్లా ఇన్​చార్జ్​లుగా మంత్రులు.. ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు

జిల్లా ఇన్​చార్జ్​లుగా మంత్రులు.. ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో భాగంగా స్కీమ్​లను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్​చార్జ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. సీఎం, డిప్యూటీ సీఎం మినహా పది మంది మంత్రులకు పది జిల్లాలను అప్పగిస్తూ ఆదివారం సీఎం శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులకు వారి వారి సొంత జిల్లాలు కాకుండా వేరే జిల్లాలకు ఇన్​చార్జ్​లుగా నియమించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కరీంనగర్ ఇన్​చార్జ్​గా, దామోదర రాజ నర్సింహను మహబూబ్​నగర్​, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డికి ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబును రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వరంగల్, పొన్నం ప్రభాకర్​ను హైదరాబాద్, కొండా సురేఖను మెదక్​, సీతక్కను ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వర్ రావును నల్గొండ జిల్లాలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూపల్లి కృష్ణా రావును నిజామాబాద్ జిల్లా ఇన్​చార్జ్​గా నియమించింది. ఆయా ఇన్​చార్జ్ మంత్రులు వారికి అప్పగించిన జిల్లాల్లో ప్రజాపాలనకు సంబంధించిన కార్యకలాపాలు, సమీక్షలు పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 

మంత్రుల చేతుల మీదుగా పథకాల అమలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రులను జిల్లాలకు ఇన్​చార్జ్​లుగా నియమించినా.. జీవో జారీ చేయలేదు. చాలా జీవోలు దాచేసి.. రహస్యంగా పనులు కానిచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. కానీ, కాంగ్రెస్ సర్కార్ జిల్లాలకు ఇన్​చార్జ్ మంత్రుల విషయంలో జీవో ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా స్కీమ్​లు అమలు చేయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రుల చేతుల మీదుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇన్​చార్జ్ మంత్రుల ఆమోదంతోనే పథకాలు ప్రజల వద్దకు చేర్చాలని భావిస్తున్నది.