పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే సీపీగెట్ ఉంటదా..ఉండదా?

పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే సీపీగెట్ ఉంటదా..ఉండదా?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌‌కాం తదితర పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే సీపీగెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించాలనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడమే దీనికి కారణం. అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసినా.. కనీసం 3 నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. దీంతో పరీక్ష నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి. సీపీగెట్ పెడ్తారో లేదో ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.

ఇంకా పూర్తి కాని డిగ్రీ ఎగ్జామ్స్..

ఉస్మానియా యూనివర్సిటీతోపాటు కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూ వర్సిటీల పరిధిలో పీజీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గతేడాది నుంచి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టులు(సీపీగెట్) నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యామండలికి కాకుండా ఏదో ఓ యూనివర్సిటీకి ఎగ్జామ్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతేడాది ఓయూ సీపీగెట్ కండక్ట్ చేసింది. కానీ ఈ ఏడాది ఏ వర్సిటీకీ బాధ్యతలు అప్పగించలేదు. వాస్తవానికి కరోనా తీవ్రత లేకుంటే ఏప్రిల్లోనే నోటిఫికేషన్ జారీ చేసేవారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఎఫెక్ట్తో డిగ్రీ పరీక్షలూ ఇంకా పూర్తి కాలేదు. మొన్నటి వరకూ పరీక్షలు ఉండవనే చర్చ జరిగింది. తాజాగా ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ నిర్వహించాలని యూజీసీ ఆదేశించడంతో, పరీక్షలపై చర్చ మొదలైంది. అయితే సర్కారు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఓయూకే బాధ్యతలు?

గతేడాది నిర్వహించిన ఓయూకే సీపీగెట్ బాధ్యతలు అప్పగిస్తారని ఉన్నత విద్యా మండలి అధికారులు ఓరల్గా చెప్పినా, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రెన్స్ నిర్వహణ, కౌన్సిలింగ్ ఇవన్నీ చేయాలంటే కనీసం మూడు నెలలు పట్టే అవకాశముంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా, అక్టోబర్ వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే, మరింత టైం తీసుకునే అవకాశముంది. అయితే ఇంతవరకూ ఏ యూనివర్సిటీకి అధికారికంగా నిర్వహణ బాధ్యతలు ఇవ్వకపోవడం, కన్వీనర్ నియామకం చేయకపోవడంతో ఈసారి సీపీగెట్ పెట్టొద్దనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు వాదనలున్నాయి. డిగ్రీ మార్కుల ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారా.. లేక ఈ ఏడాది పీజీకోర్సుల్లో అడ్మిషన్లు లేకుండా జీరో ఇయర్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.