హైదరాబాద్, వెలుగు: ఓఎంఆర్ షీట్లు రోడ్డుపై పడి ఉండటంపై టీజీపీఎస్సీ సీరియస్‌గా స్పం దించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేసింది. మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసు లు జారీ చేయడంతోపాటు సదరు కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ రద్దు చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల రోడ్డు పక్కన కొన్ని ఓఎంఆర్ షీట్లు పడి ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. అవి 2018లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినవని తేల్చింది.
ఈ పరీక్ష ఫలితాలు 2020లోనే వెల్లడయ్యాయని, నిబంధనల ప్రకారం పాత రికార్డులను పారేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని కమిషన్ వివరించింది. పాత ఓఎంఆర్ షీట్లను తరలిస్తున్న సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అవి రోడ్డుపై పడ్డాయని స్పష్టం చేసింది. రికార్డుల తరలింపులో పర్యవేక్షణ లోపించిందన్న కారణంతో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత తెలిపారు. బాధ్యులైన మరో నలుగురు అధికారులను వివరణ కోరారు.
