
నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అనుమాదాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితులపై ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జీతాల్లేక, ఉద్యోగాన్ని వదులుకోలేక, విధుల్లో చేరలేక ఆర్టీసీ కార్మికులు తనువు చాలిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ ఏ. వెంకటేశ్వర్లు మృతదేహం రోడ్డు పక్కన ఉంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.