
- 1,248 బస్సులకు 22 వేల దరఖాస్తులు
- వరంగల్, కరీంనగర్‌లో 4500పైగా..
- హైదరాబాద్‌లో 248 బస్సులకు 332 అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: అద్దె బస్సుల కోసం ఆర్టీసీ అధికారులు చేపట్టిన టెండర్ ప్రక్రియ కార్మికుల ఆందోళనల మధ్యే కొనసాగింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టెండర్లను కార్మికులు అడ్డుకున్నారు. అయినప్పటికీ అధికారులు పోలీసుల సహాయంతో వేరే ప్రాంతాలకు తరలించి టెండర్లు నిర్వహించారు. కరీంనగర్‌లో టెండర్ల ప్రక్రియ ఆపాలంటూ కార్మికులు కలెక్టరేట్ ముట్టడించారు. అద్దె బస్సులను తొలగించాలని కార్మికుల డిమాండ్లలో ఉండగానే ప్రభుత్వం టెండర్ వేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1248 బస్సులకు 22వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అత్యధికంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 4500 చొప్పున అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక హైదరాబాద్ పరిధిలో 248 బస్సులకు 332 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల మొదటి టెండర్‌లో హైదరాబాద్ పరిధిలో తక్కువ అప్లికేషన్లు రావడంతో మళ్లీ వేశారు. కాగా టెండర్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
జిల్లాల్లో ఇలా..
కరీంనగర్‌లో మొత్తం 59 రూట్లలో 144 అద్దె బస్సులకు టెండర్లు పిలిచారు. ఇటీవల బస్టాండ్‌లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తే ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఈ రోజు కలెక్టర్ ఆడిటోరియం లో నిర్వహించారు. మహబూబ్ నగర్‌లో మొత్తం 132 బస్సుల కోసం 3396 దరఖాస్తులు వచ్చాయి. 40 రూట్లలో వీటిని నడిపించనున్నారు. టెండర్ నిర్వహించవద్దని కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
మెదక్ ఆర్టీసీ రీజియన్‌లో 34 రూట్లకు 113 బస్సులకు 1,350 టెండర్లు వచ్చాయి. ఖమ్మం రీజియన్‌లో 36 రూట్లలో 100 బస్సులకు 2071 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్‌లో తొమ్మిది డిపోల పరిధిలో 125 బస్సులకు 4,500పైగా దరఖాస్తులు వచ్చాయి. మొదటి దఫా టెండర్ల నిర్వహణలో కార్మికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.