హైదరాబాద్​ రోడ్లపై 500 కొత్త ఏసీ బస్సులు

హైదరాబాద్​ రోడ్లపై 500 కొత్త ఏసీ బస్సులు

టీఎస్ఆర్టీసీ త్వరలో సరికొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ రూపొందిస్తున్న ఈ బస్సుల్లో అత్యాధునిక వసతులు, భద్రతా చర్యలు ఉంటాయి.దూర ప్రయాణాలు చేసే వారికోసం టీఎస్ఆర్టీసీ సరికొత్త ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను మే నెలలో ప్రారంభించేందుకు రంగం సిద్ధచేసింది. పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా ఇదొక కీలకమైన అడుగని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కాలుష్య నియంత్రణతో పాటు ప్రయాణీకులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులు దోహదపడతాయని ఆయన అన్నారు. 
మెత్తం ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులంటే..
పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా  టీఎస్​ఆర్టీసీ 550 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 500 బస్సులను హైదరాబాద్‌ నగరంలో, 50 బస్సులను విజయవాడ మార్గంలో తిప్పనున్నారు. వీటితో పాటు అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని సజ్జనార్ తెలిపారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను ఆయా సంస్థలు టీఎస్‌ఆర్టీసీకి అందజేయనున్నాయి.
ఎలక్ట్రిక్​ బస్సు ప్రత్యేకతలు
12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు  రీడిండ్‌ ల్యాంప్‌‌లను ఏర్పాటు చేశారు. వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. ప్రతి బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంచుతారు.బస్సుకు ముందు వెనుకా ఎల్ఈడీ బోర్డులుంటాయి. వాటిలో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి.