ఆర్టీసీ సంబురాలు ఎందుకు జరపట్లే :

ఆర్టీసీ సంబురాలు ఎందుకు జరపట్లే :

రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబురాలు చేస్తున్నది. ఇందులో అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు చేసి ప్రచారం చేస్తున్నారు. మరి రవాణా శాఖ ఆర్టీసీ సంబురాలు ఎందుకు జరపడం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సలక జనుల సమ్మె ఎంతో కీలక మైంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆర్టీసీ బాగు పడుతుందని, తమ జీవితాలు మెరుగవుతాయని ఉద్యోగాలను లెక్క చేయకుండా ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తొమ్మిదేండ్లలో రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

నాలుగు వేల గ్రామాలకు బస్సే లేదు

రాష్ట్రంలో 12 వేల గ్రామాలు ఉంటే 2014లో 1200 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇపుడు 4 వేల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. వజ్ర బస్సులు కొనే టైమ్ లో అవి వద్దని, నష్టాలు వస్తాయని కార్మిక సంఘాలు చెబుతున్నా వాటిని పట్టించుకోకుండా కొన్నరు. ఎంతో కాలంగా వజ్ర బస్సులను పక్కన పెట్టారు. ఆర్టీసీని ఈ తొమ్మిదేండ్లలో నాశనం చేసిండ్రు. ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గా పనిచేసిన అని, ఆర్టీసీని, రవాణా రంగాన్ని డెవలప్ చేస్త అని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రభుత్వం ఆర్టీసీని గాలికొదిలేసింది. బడ్జెట్​లో కేటాయించిన నిధులు ఇవ్వడం లేదు. రూ.1500 కోట్లు కేటాయిస్తూ అందులో సగం కూడా విడుదల చేయడం లేదు. బస్ పాస్ రీయింబర్స్ మెంట్ నిధులు కూడా సకాలంలో ఇవ్వకపోవటం వల్ల కార్పొరేషన్ తీవ్ర అప్పులు, ఇబ్బందుల్లో ఉంది. పీఎఫ్, సీసీఎస్ బకాయిలు, 2 పీఆర్సీలు బకాయిలు ఉన్నాయి. మహిళా కండక్టర్లకు రాత్రి 9 తరువాత డ్యూటీలు ఉండవని చెప్పిన కేసీఆర్.. ఆ హామీని అమలు చేయలేదు. కొత్త ఉద్యోగాలను రిక్రూట్ చేయలేదు, కారుణ్య నియామకాల్లోనూ తొలిసారిగా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేశారు.

ఏపీలో అట్ల.. తెలంగాణలో ఇట్ల

ఏపీలో ఆర్టీసీ ఎంతో డెవలప్ అయింది. అక్కడి కార్మికుల జీతాలకు ఇక్కడి కార్మికుల జీతాలకు చాలా తేడా ఉంది. కొత్త బస్సుల కొనుగోలుకు ఏపీలో నిధులు ఇస్తున్నరు. సీసీఎస్ లో పెద్ద ఎత్తున డిపాజిట్లు ఉన్నాయి, కార్మికులకు సకాలంలో లోన్లు ఇస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు. అక్కడ కార్మికుల జీతాలు పెరిగినయి. నష్టాలు తగ్గినయి, కార్గో లాభాల్లో ఉంది. తెలంగాణలో తొమ్మిదేండ్లుగా ఆర్టీసీ బస్సులు తగ్గుతుంటే ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నయి. ప్రజాస్వామ్యం ఉండొద్దు, ఎన్నికలు, యూనియన్లు వద్దు. అంతా నేనే అన్నట్లు కేసీఆర్ పాలిస్తున్నారు. మునుగోడు ముందు ఆర్టీసీకి ఎంతో చేస్తామని హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్న కమ్యూనిస్టు యూనియన్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదు. యూనియన్లు ఉండొద్దని వాటిని రద్దు చేశారు. వెల్ఫేర్ అసోసియేషన్లు అని ఏర్పాటు చేస్తే అవి అడ్రస్ లేదు. వెల్పేర్ అసోసియేషన్ల మీటింగ్ లు జరగటం లేదు. లేబర్ యాక్ట్ ప్రకారం ఏ సంస్థలో అయిన యూనియన్లు ఉండాలి. ఇటీవల హైకోర్టులో యూనియన్ ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేస్తే మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయాలని కోరుతున్నం. జేఏసీగా అన్ని యూనియన్లు ఏర్పడి సమస్యలపై పోరాడుదామంటే ఇతర యూనియన్లు ముందుకు రావటం లేదు. కార్మికులపై అధికారుల వేధింపులు, పనిభారం చాలా పెరిగింది. 

ఉద్యోగులు ఇంటికి.. స్థలాలు అయినోళ్లకు 

ఉద్యోగులు తగ్గుతున్నరు. ఆర్టీసీలో ప్రైవేట్ కన్సల్టెంట్లు రాజ్యమేలుతున్నరు. లక్షల జీతం ఇస్తూ 40 మంది ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్నరు. గ్రేటర్​లో నష్టాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుందన్న హామీ కాగితాలకే పరిమితమైంది. ఆర్టీసీ స్థలాలన్నీ అధికార పార్టీ నేతలకు లీజుకు ఇస్తూ మల్టిప్లెక్స్​లు కడుతున్నరు. ఆర్టీసీలో 3600 అద్దె బస్సులు నడుస్తున్నయి. వీటిని తగ్గించాలి.  వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కాజేసీ ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది. పురాతన కట్టడాలు ఏవీ ఉండొద్దని అన్ని తన హయాంలో నిర్మించినవే ఉండాలని, అన్ని తన పేరు మీదవే ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. గండిపేట, హిమాయత్ సాగర్ జంట నగరాలకు నీటి సరఫరా చేస్తుండగా వాటిని డెవలప్ చేయకుండా ఇపుడు కైత్లాపూర్ రిజర్వాయర్ అని తన హయాంలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నడు.
–అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ యూనియన్ నేత