
ఇబ్రహీంపట్నం, వెలుగు: కార్మికుల సమ్మె 27వ రోజు నిరసన కార్యక్రమాలతో కొనసాగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికులు గురువారం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు 24 గంటల నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆయిల్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, జంగయ్య, యాదయ్య, చందర్, సదానంద్, కార్మికులు పాల్గొన్నారు.
దిల్ సుఖ్ నగర్ : దిల్ సుఖ్ నగర్ డిపో వద్ద కార్మికులు 24 గంటల దీక్ష చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు జీఎన్ రెడ్డి, సాజు నాయక్, పాషా, ఛాయా దేవి, పద్మ, శ్రీదేవి, విమల తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం ముషీరాబాద్ వీఎస్ టీ చౌరస్తాలో ముషీరాబాద్ ఆర్టీసీ 1,2 డిపో జేఏసీ నాయకులు నిరాహార దీక్షకు దిగారు.
ఎల్ బీ నగర్: హయత్ నగర్ రెండు డిపోలకు చెందిన కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వ ఖాతాలో కార్మికుల హత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మరణాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
మహేశ్వరం: మహేశ్వరం లో కార్మికులు ఆర్టీసీ డిపో ఎదుట 24 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. జేఏసీ నాయకులు అక్తర్ పాషా, జితేందర్, మల్లేష్, పెంటేష్, కార్మికులు పాల్గొన్నారు.
పరిగి : ఆర్టీసీ కార్మికులు పరిగి బస్టాండ్ వద్ద సామూహిక నిరాహారదీక్షలు చేశారు. కాంగ్రెస్ నాయకులు భాస్కర్, కార్మికులు నిరంజన్, శ్యాం, జంగయ్య, అరుణ, పార్వతమ్మ, లక్ష్మీ, సరిత తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజేంద్రనగర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు.
పరిగి: సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిద్దామని జేఏసీ నాయకులు ముకుంద నాగేశ్వర్ అన్నారు. పరిగి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సామూహిక నిరాహార దీక్షను సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
వికారాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ నాయకులు జీవికే రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆర్టీసీ డిపో ముందు 24 గంటల పాటు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
షాద్ నగర్: ఆర్టీసీ కార్మికులు షాద్నగర్ టౌన్లో గురువారం 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ నర్సింలు మాట్లాడుతూ 27 రోజులుగా చేస్తున్న సమ్మెకు ఒక్క టీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీ లు, కుల సంఘాలు, విద్యార్ధి నాయకులు, ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు.
మేడిపల్లి: ఆర్టీసీ కార్మికులు ఉప్పల్, చెంగిచెర్ల డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలు జరిపారు. ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీని విలీనం చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
కుషాయిగూడ: కుషాయిగూడ డిపో ముందు డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బంది నిరాహార దీక్ష నిర్వహించారు.