కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాదిమంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి.. స్వామి వారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు శ్రీవారి అన్న ప్రసాదాల తయారీకి ప్రసాద కేంద్రం వంటశాలలో పీ.యస్.జీ గ్యాస్ ను వినియోగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ ను వినియోగిస్తున్నారు. దీనికి ఏడాదికి రూ. 4.2 కోట్లు ఖర్చవుతుంది. అయితే పీఎస్జీ వినియోగం ఏడాదికి రూ. 1.84 కోట్లు అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. దీనివలన సంవత్సరానికి ఏకంగా రూ. 2.18 ఖర్చుతగ్గనుంది. సింగపూర్ కేంద్రంగా సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ (థింక్ గ్యాస్) సరఫరా చేయనుంది. ఇప్పటికే తిరుచానూరు పద్మావతి అమ్మవారి అన్నప్రసాద కేంద్రంలో పైలెట్ ప్రాజెక్టుగాచేపట్టి విజయవంతం అయ్యారు.
