ఏపీ, తెలంగాణల్లోని 50 వేల ఆలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ. ఈమేరకు ఉన్న అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు ఈవో రవిచంద్ర. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్ లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈవో రవిచంద్ర.
శ్రీవారి సేవను మరింత విస్తరించేందుకు గ్రూప్ సూపర్వైజర్లు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు ఈవో రవిచంద్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించేందుకు ఉన్న అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.
గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమం ద్వారా నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుండి శ్రీవారి సేవకు విచ్చేసే ముందు సేవకులకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు తిరుమలకు వచ్చి నాణ్యమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. శ్రీవారి సేవకులు స్వామివారికి సేవ చేయడానికి తిరుమలకు రావడంతో పాటు తమ ప్రాంతాలు, గ్రామాల్లోని స్థానిక ఆలయాల్లో సేవలందించేలా వారిని ప్రోత్సాహించాలని అన్నారు రవిచంద్ర.
శ్రీవారి సేవకులకు వారి పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ ఇచ్చి, ఆ రేటింగ్ ఆధారంగా విధులు కేటాయించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమం, శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించడం, భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం వంటి అంశాలపై గ్రూప్ సూపర్వైజర్ల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు టీటీడీ ఈవో రవిచంద్ర.
