హైదరాబాద్, వెలుగు: టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ టీడీపీ నాయకుల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసింది. గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్మును కలిసిన టీటీడీపీ నేతలు.. మొదటి సారిగా సిటీకి వచ్చిన సందర్భంగా ఆమెకు పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేట్లుగా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేటట్లుగా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ బృందంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త కంభంపాటి రామ్మోహన్ రావు, జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, టి. జ్యోత్స్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, టీడీపీ నాయకులు అట్లూరి సుబ్బారావు, కాసాని వీరేష్, కాసాని సాయి, బండారి వెంకటేష్, మారయ్య తదితరులు ఉన్నారు.
గాంధీ హాస్పిటల్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్
పద్మారావునగర్, వెలుగు: టీఎన్జీవో యూనియన్హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ గ్రీవెన్స్‌ను గురువారం గాంధీ హాస్పిటల్లో నిర్వహించారు. ఎంప్లాయిస్‌తో సమావేశమైన జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ డా. ఎస్. ఎం. హుస్సేనీ సమస్యలు తెలుసుకున్నారు. ఎంప్లాయీస్ డిమాండ్ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే జనవరి 6న నాంపల్లి గృహకల్పలో డైరీ, 2023 క్యాలెండర్ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఎంప్లాయీస్‌ను ఆహ్వానించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని ఆ రోజు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలు సైబర్ నేరగాళ్లు
- పంచాయతీ నిధులను మాయం చేసి రైతుబంధుగా ఇస్తున్నరు
- పీసీసీ ప్రధాన కార్యదర్శి బుర్ర జ్ఞానేశ్వర్ ఆరోపణ
శంషాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు సైబర్ నేరగాళ్లని.. పంచాయితీ నిధులను దోచుకుంటూ వాటినే రైతు బంధుగా కట్టబెడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి బుర్ర జ్ఞానేశ్వర్, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ జల్పల్లి నరేందర్ ఆరోపించారు. గ్రామ పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులను కాజేసిన కేసీఆర్ సర్కారుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. గురువారం శంషాబాద్ మండలం నర్కుడలో జరిగిన కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశానికి వీరు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం ఎగరేసుకుపోయిందని.. దీంతో గ్రామాల్లో సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీల అకౌంట్ల నుంచి ప్రభుత్వం తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులందరితో కలిసి పోరాటం చేస్తామన్నారు.
కులం లేని సమాజం కోసం ‘ సీ ఫర్ క్యాస్ట్’
ముషీరాబాద్, వెలుగు: సతీశ్‌చందర్ రాసిన ‘సీ ఫర్ క్యాస్ట్’ పుస్తకంపై ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ఫెయిర్లో అలిశెట్టి ప్రభాకర్ వేదికగా గురువారం చర్చా కార్యక్రమం జరిగింది. సతీశ్ చందర్ మాట్లాడుతూ.. చాలామంది వస్తు మార్పిడి గురించి మాట్లాడారు. కానీ వృత్తి మార్పిడి గురించి మాట్లాడడం లేదన్నారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ సతీష్ చందర్ కుల వ్యవస్థ పైన పరిశోధన వ్యాసాలను ‘సీ ఫర్ క్యాస్ట్’ పేరుతో రాయడం అభినందనీయమన్నారు. కులం లేని సమాజం కోసం రాసిన రచనగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, డాక్టర్ కొండ నాగేశ్వర్ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, రచయిత జూపాక సుభద్ర, విమర్శకులు అంబటి సురేందర్ రాజు, పసునూరి రవీందర్, స్టూడెంట్లు, టీచర్లు పాల్గొన్నారు.
ఆదిత్య, అనికాకు గోల్డ్ మెడల్స్
హైదరాబాద్, వెలుగు: కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న సబ్ జూనియర్, జూనియర్ సౌత్ జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా ఆదిత్య వోబు, అనికా డెబోరా గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. గురువారం జరిగిన బాయ్స్ గ్రూప్-3 కేటగిరీల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఆదిత్య 30.82 సెకండ్ల టైమింగ్‌తో టాప్ స్లేస్ సాధించాడు. గర్ల్స్‌లో అనికా31.62 సెకండ్లతో మొదటి స్థానం సాధించి గోల్డ్ గెలిచింది. మరోవైపు 400 మీ. ఐఎం ఈవెంట్‌లో డి. వర్షిత్ 4 నిమిషాల 57.31 టైమింగ్‌తో సిల్వర్ సాధించాడు. మేఘనా నాయర్ 100 మీటర్ల ఫ్రీ స్టైల్‌లో 1 నిమిషం 09.89 సెకండ్లతో టైమింగ్‌తో కాంస్యంతో సరిపెట్టుకుంది.
బాస్కెట్‌బాల్ క్వార్టర్స్‌లో ఓయూ టీమ్
హైదరాబాద్, వెలుగు: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ టీమ్ తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఓయూ టీమ్ వరుస విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో 59-–34తో పెరియార్ యూనివర్సిటీ (తమిళనాడు)ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో 67–62తో భతార్దిదాసన్ యూనివర్సిటీ (తమిళనాడు)పై నెగ్గిన ఓయూ జట్టు మూడో మ్యాచ్‌లో 61–45తో యూనివర్సిటీ ఆఫ్ కేరళపై ఘన విజయం సాధించింది. టోర్నీ చరిత్రలో తొలిసారి క్వార్టర్స్ చేరుకున్న ఓయూ జట్టుకు కల్యం అమృత్ రాజ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్
వికారాబాద్, వెలుగు: గతేడాదితో పోలిస్తే వికారాబాద్ జిల్లాలో ఈసారి క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా 2,281 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2021లో జిల్లాలో 4,396 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3,523 కేసులు నమోదయ్యాయని.. క్రైమ్ రేట్12 శాతం తగ్గిందని చెప్పారు. జిల్లాలో టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటున్నారని ఆయన వెల్లడించారు. జిల్లాలో భరోసా కేంద్రం, కార్డన్ సెర్చ్, నాకాబందీని పటిష్టంగా నిర్వహిస్తున్నామని... సర్టిఫికెట్లు లేని 376 వెహికల్స్‌ను సీజ్ చేశామన్నారు. పోలీసుల పనితీరును పరిశీలించేందుకు ప్రతి నెలా సబ్ డివిజన్, సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్
ఖైరతాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్‌గా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన అశోక్ కొండాపూర్‌లో నివసిస్తూ సిటీలో డ్రగ్స్సప్లయ్ చేస్తున్నాడు. గురువారం కొండాపూర్‌లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద డ్రగ్స్అమ్ముతుండగా ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 3.59 గ్రాముల ఎమ్‌డీఎం డ్రగ్స్‌తోపాటు సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కాగా విశాఖపట్నానికి చెందిన సత్యనారాయణ అలియాస్ సత్తి అనే డ్రగ్ పెడ్లర్ తన స్థావరాన్ని గోవాకు మార్చుకుని అక్కడి నుంచి డ్రగ్స్‌దందా సాగిస్తున్నాడు. అతడి నుంచి వచ్చిన డ్రగ్స్‌ను అశోక్అమ్ముతుండగా అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సత్యనారాయణపై సిటీలో రెండు కేసులున్నాయన్నారు.
గంజాయి అమ్ముతూ మరొకరు..
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహమత్ నగర్లో గంజాయి అమ్ముతున్న రాంబాబు అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.3 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం చేసినందుకే సూసైడ్
శంషాబాద్‌లో యువతి అనుమానాస్పద మృతి
కేసులో వీడిన మిస్టరీ
పెండ్లయిన విషయాన్ని దాచి
ప్రేమ వ్యవహారం నడిపిన డాక్టర్
ఆత్మహత్యకు కారణమైన నిందితుడి అరెస్ట్
శంషాబాద్, వెలుగు: ఐదు రోజుల కిందట శంషాబాద్ మండలం ఊటుపల్లిలో జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. తనకు పెండ్లి జరిగిన విషయాన్ని దాచి.. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. శంషాబాద్ రూరల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన తాళ్ల పూజిత (27) శంషాబాద్‌లో ప్రైవేటు జాబ్ చేస్తూ మండల పరిధి ఊటుపల్లి గ్రామం రాయల్ విల్లాస్ కాలనీలో రూమ్ రెంట్‌కు తీసుకుని ఉంటోంది. పూజిత సివిల్స్ ఎగ్జామ్స్ కు సైతం ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో డాక్టర్ మహ్మద్ అలీ సుతర్తో పూజితకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని అలీ నమ్మించాడు. అలీకి గతంలోనే పెండ్లయిన విషయాన్ని పూజితతో చెప్పకుండా ప్రేమ వ్యవహరం నడిపించాడు. అతడికి అంతకుముందే పెండ్లయిన విషయం తెలుసుకున్న పూజిత మోసపోయినట్లు గుర్తించింది. మనస్తాపంతో ఈ నెల 26న ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. అనుమానాస్పదస్థితిలో పూజిత సూసైడ్ చేసుకోవడంతో స్థానికులు ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పూజిత ఆత్మహత్యకు డాక్టర్ మహ్మద్ అలీ కారణమై ఉంటాడని ఆమె చెల్లెలు ఇచ్చిన కంప్లయింట్ మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ మహ్మద్ అలీ సుతర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పూజిత ఆత్మహత్యకు అతడే కారణమని తేల్చారు. గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

