టీవీ టెక్నీకల్ ఉద్యోగులకు సముచిత గుర్తింపు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు TVTEWA సభ్యులు. శనివారం ( ఆగస్టు 1 ) మంత్రిని కలిసిన టీవీ టెక్నీకల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు ఈమేరకు వినతి పత్రం అందించారు. ప్రజలకు ప్రతి క్షణం వార్తలను అందిస్తున్న టెలివిజన్ న్యూస్ ఛానళ్ల విజయానికి కనిపించే ముఖాలు యాంకర్లు, రిపోర్టర్లు అయితే... ఆ వార్తలను కోట్లాది మంది ఇళ్లకు నిరంతరాయంగా చేరవేస్తున్న కనిపించని శక్తి టీవీ సాంకేతిక ఉద్యోగులదేనని పేర్కొన్నారు.
టీవీ సాంకేతిక ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు, మీడియా అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు మరియు సంక్షేమ పథకాలు కల్పించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ఒక వార్త ప్రసారం కావడానికి ముందు నుంచి చివరి వరకు ప్రతి దశలో టెక్నికల్ సిబ్బంది కూడా కీలక పాత్ర పోషిస్తారని వివరించారు.
రిపోర్టర్లు పంపిన వీడియోలను స్వీకరించడం నుండి 24 గంటలూ ఎలాంటి అంతరాయం లేకుండా కోట్లాది మంది వీక్షకులకు వార్తలను చేరవేయడం వరకు, అత్యంత కీలక బాధ్యతలను టెక్నికల్ సిబ్బంది నిర్వహిస్తున్నారని తెలిపారు.
సాంకేతిక ఉద్యోగులను తప్ప మిగతా అన్ని శాఖలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని.. మిగతా శాఖలతో సమానంగా టీవీ సాంకేతిక ఉద్యోగులను కూడా గుర్తించి, మీడియా అక్రిడిటేషన్, ఆరోగ్య కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
